సాధారణంగా మామిడి నవంబర్, డిసెంబర్ నెలాఖరు వరకు పూత రావాల్సి ఉంటుంది. కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల కారణంగా మామిడి పూత రావడం చాలా ఆలస్యమైంది. జనవరి నెలాఖరులో, ఫిబ్రవరి మొదటి వారంలో ఆలస్యంగా పూత వచ్చింది. చలి తగ్గి మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల వచ్చిన పూత నిలవని పరిస్థితి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నెలకొంది.
మామిడి తోటలకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఉద్యానవన శాఖతో సంబంధం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీయే నేరుగా బీమా చేస్తుండడంతో రైతులకు దీనిపై అవగాహన కరువైంది. ప్రతి యేటా డిసెంబర్ నెలలో బీమాకు సంబంధించిన ప్రీమియంను చెల్లించాల్సి ఉంటుంది. కానీ రైతులకు బీమా పట్ల అవగాహన లేకపోవడం, ప్రచారం లేకపోవడం వల్ల వినియోగించుకోలేకపోతున్నారు.