No allocations for Polavaram: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం పద్ధతి మారడం లేదు. ఎప్పటిలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలఆశలపై ఈసారి బడ్జెట్లోనూ నీళ్లు చల్లింది. నాబార్డు రుణం ద్వారా అందించే నిధులపై ప్రతిపాదనల రూపంలో లేదా కేటాయింపుల రూపంలో పోలవరానికి అదనంగా పైసా కూడా కేటాయించింది లేదు.
పోలవరానికి నిధులు ఇచ్చే విషయంలో మొదటి నుంచి చిన్నచూపే చూస్తోంది. 55,656 కోట్ల రూపాయలకు సవరించిన అంచనాలు ఆమోదించేందుకు ఏళ్ల తరబడి ఉత్తర ప్రత్యుత్తరాలతో సాగదీస్తోంది. 2010-11 నాటి ధరలతో ఆమోదించిన 16010.45 కోట్ల రూపాయల అంచనాలనే పరిగణనలోకి తీసుకుంటున్న కేంద్రం.. ఆ నిధులూ ఇచ్చేందుకు కొర్రీలు వేస్తూ వస్తోంది.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువ ఎత్తుతున్నాయి. పోలవరం ప్రాజెక్టుతో మొత్తం 30.7 లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. ఇందులో 7.2 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు కాగా, 23.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు.
540 గ్రామాల్లోని 28.5 లక్షల జనాభాకు తాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సాధ్యమవుతుంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు 1.5 టీఎంసీల నీటిని సరఫరా చేయొచ్చు. గోదావరి నుంచి 80 టీఎంసీల నీటిని కృష్ణాకు మళ్లించవచ్చు. దీంతో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలకు అదనపు నీరందుతుంది. అలాగే కేంద్రం చెబుతున్న నదుల అనుసంధానం విధానానికి ఇది ఆలంబన కానుంది. అయినా కేంద్రం చిన్నచూపే చేస్తోంది.
ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి సుమారు 3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం 4 వేల కోట్ల రూపాయలతో కలిపి.. 2022–23 బడ్జెట్లో కనీసం ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి 26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్లో కేటాయించిన 18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు 1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు 6,922.81 కోట్లు వెరసి 8,322.81 కోట్లు కేటాయించింది.
పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు.. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని, రాష్ట్రానికి విడుదల చేస్తామని పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. దాంతో 2016–17 నుంచి బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించని కేంద్రం.. నాబార్డు ద్వారా రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తోంది.
ఇలాగైతే ఎన్నేళ్లు పడుతుందో?
2021-22 కేంద్ర బడ్జెట్లోనూ పోలవరానికి నిధులు కేటాయించలేదు. ఈబీఆర్ రూపంలో 1,070 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో నాబార్డు రుణం 751.80 కోట్లు కాగా, కేంద్ర బడ్జెట్ ద్వారా 320 కోట్లు మంజూరు చేసింది. ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఇంకా 30 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన కేంద్రం రీయింబర్స్ చేస్తూ పోతే మొత్తం నిధులు ఇచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుంది? ఈలోగా నిర్మాణ వ్యయం ఎలా పెరుగుతుంది? అంచనాలు మారితే మళ్లీ అనుమతులు సాధ్యమేనా? అన్నవి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.