Omicron Tension: సైలెంట్ చడి చప్పుడు లేకుండా కరోనా కొత్త వేరియంట్ దూసుకొస్తోంది. మొన్నటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడు భారత దేశాన్ని భయపెడుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో నాలుగు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
ఉస్మానాబాద్ జిల్లాలో రెండు కేసులు, ముంబై, బుల్దానాలో ఒక్కొక్క కేసు నమోదైనట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 32కు చేరినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 25 మంది రోగులకు నెగిటివ్ రిపోర్ట్ రాగా డిశ్చార్జ్ అయ్యారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మహారాష్ట్రలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ కట్టడికి అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మళ్లీ రాత్రి కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు.. వీకెండ్స్ లో కఠిన నిబంధనలు, అలాగే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు తదితర అంశాలపై ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై మహా సర్కార్ యోచిస్తోంది.
ఏడేళ్ల బాలుడు తల్లిదండ్రులతో కలిసి అబుదాబి నుంచి డిసెంబర్ 10న హైదరాబాద్ మీదుగా బెంగాల్ ముర్షిదాబాద్ కు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీ- పీసీఆర్ పరీక్ష కోసం నమూనాలు సేకరించారు. అనంతరం బాలుడు కుటుంబం.. బెంగాల్ కు పయనమైంది. బాలుడి నుంచి సేకరించిన నమూనాలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరిక్షలో ఓమిక్రాన్ వేరియంట్‌ను చూపించినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకిన అబ్దుల్లాహి అహ్మద్ నూర్‌తో తప్పిపోయిన సోమాలియన్ను బంజారాహిల్స్ పారామౌంట్ కాలనీ వద్ద సిటీ పోలీసులు అదుపులోకి తిసున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
డిసెంబర్ 12వ తేదీన షార్జా నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అతడికి 12వ తేదీన కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతన్ని గచ్చిబౌలి లోని టిమ్స్ ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువెళ్లారు. ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారు. అబుదాబి నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వీరు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు డీహెచ్ తెలిపారు. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులను గుర్తించడం జరిగిందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు ఒక్క ఒమిక్రాన్ కేసు మాత్రమే నిర్ధారణ అయ్యింది. ఇంకా రెండు మూడు శాంపిల్స్ రావాల్సి ఉన్నాయి. వీటికి తోడు విదేశాల నుంచి వచ్చిన వారిలో 121 మంది ఆచూకీ దొరికితే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓ వైపు ఒమిక్రాన్ టెన్షన్ పెడుతున్నా.. కరోనా మాత్రం కంట్రోల్ లోనే ఉంది. ఒమిక్రాన్ ఎంట్రీతో జనం హడలిపోతున్నారు. సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తున్నా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి.