తెలుగు రాష్ట్రాలలో సాధారణంగా 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండగను జరుపుకోవడం ఆనవాయితీ. కానీ ఇటకర్లపల్లి గ్రామంలో మాత్రం.. వారం రోజులు ముందే సంక్రాంతి సంబరాలు ప్రారంభమై.. మూడువారాల పాటు మూడు విధాలుగా జరుగుతాయి. కులాల వారీగా గ్రామంలో 3 వర్గాలుగా విడిపోయి మూడుసార్లు పండుగ జరుపుకుంటున్నారు. గ్రామంలో మీసాల, కెల్ల, కెంగువ ఇంటి పేరు ఉన్నవారు అందరూ సంక్రాతికి ముందు వచ్చేవారం జరుపుకుంటారు.
మరో రెండు కులాల వారు మామూలుగా కాలమాన ప్రకారం 14, 15, 16 తేదీలలోనే సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. అలాగే గ్రామంలో ఉన్న వైష్ణవులు మాత్రం పండుగ తర్వాత వచ్చే ఆది, సోమ, మంగళవారాల్లో సంక్రాంతిని నిర్వహిస్తారు. ఇలా మూడు కులాలకు చెందిన వారు సంక్రాంతి సంబరాలను మూడు వారాలు జరుపుకుంటారు. ఈ ఆనవాయితీ గత 7,8 తరాలుగా ఇటకర్లపల్లి గ్రామంలో నడుస్తుంది.
పదేళ్ల క్రితం తాము అందరితో పాటుగా సంక్రాంతి సంబరాలను చేద్దామని అనుకున్నామని.. కానీ అనుకున్న రోజే తమ కులంలోని వారికి కొన్ని వ్యతిరేక సంఘటనలు చోటుచేసుకున్నాయంటున్నారు గ్రామస్ధులు. సంప్రదాయాలను మీరితే గ్రామానికి అరిష్టమని భావించి వాటికి గౌరవం ఇస్తూ అదే రీతిలో నడుచుకుంటున్నామన్నారు ఇటకర్లపల్లి వాసులు.
వాట్సప్ స్టిక్కర్స్, హ్యాపీ భోగి 2022" width="1600" height="1600" /> ఈ గ్రామానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. అందరూ జరుపుకొనే భోగి పండగను ఈ గ్రామంలో జరుపుకోరు. భోగి మంటలకు ఈ గ్రామం దూరంగా ఉంటోంది. దశాబ్దాల కిందట.. గ్రామంలో జరిపిన భోగి పండుగలో అపశృతి చోటుచేసుకుంది. మంటల్లో పిల్లి పడి మరణించడంతో గ్రామస్తులంతా ఏకమై భోగి మంటల్ని రద్దు చేయాలని తీర్మానించుకున్నారు. దీని ప్రకారం గ్రామంలో భోగి మంటలు నిషేధం. మంటలు లేకుండానే పండుగ జరుపుకుంటారు.
కానీ భోగి పండుగ రోజు పాటించే మిగిలిన ఆచారాలను మాత్రం ఈ గ్రామస్తులు కొనసాగిస్తున్నారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా అల్లుళ్లు, బంధుమిత్రులు, చిన్నారులు వచ్చి చేరడంతో గ్రామమంతా కళకళలాడింది. ఎక్కడెక్కడి నుండో వచ్చిన చిన్నారులు, మహిళలు చేసే సందడి ఇంతా అంతా కాదు. అరిసెలు, పొంగడాలు వంటి వంటకాలను తయారు చేసి.. సంక్రాంతి రోజు సాయంత్రం గ్రామంలో ఉన్న ఓ ఇంటిలో కులదైవం వేంకటేశ్వరస్వామిని ఆరాదిస్తూ.. ఉదయం నుండి వండిన వంటలన్నీ నైవేద్యంగా పెట్టారు.
స్వీట్లతో పాటు మాంసాహారం, ఈత కళ్లు, తాటి కళ్లు వంటివి నైవేధ్యంగా పెడతారు. అయితే వేంకటేశ్వరస్వామికి పెట్టే నైవేధ్యాన్ని గ్రామంలో ఉన్న మగవారు తప్ప మహిళలు చూడరు. అలాగే గ్రామంలో ఉన్న మగవారు తప్ప బయటినుండి వచ్చే మగవారికి కూడా చూపించరు. మొత్తానికి గ్రామంలో సంక్రాంతి రోజు చేసే పూజలను నిష్టనియమాలతో చేస్తారు ఇటకర్లపల్లి వాసులు.
బయట ఊళ్లలో నివాసం ఉంటూ.. ఇటకర్లపల్లిలో సోమవారం సంక్రాంతి పండుగ చేసుకున్న కొన్ని ఇంటిపేర్ల కుటుంబాలు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే వారం జరుపుకునే భోగీ, సంక్రాంతి, కనుమ పండుగలను కూడా జరుపుకుంటారు. రెండు రకాల ఆచారాలతో రెండుసార్లు సంక్రాంతి పండుగలను జరుపుకోవడం ఒక్క ఇటకర్లపల్లి వాసులకు మాత్రమే దొరికిన అద్ళష్టం. తామంతా ఎంతో సంతోషంగా ఈ సంక్రాంతి, భోగీ పండుగలను జరుపుకుంటున్నామని, వారం తర్వాత మరలా బయట ఊళ్లల్లో, తాము చదువుకుంటూ, నివాసముంటున్న చోట పండుగ జరుపుకుంటామని సంతోషంగా చెబుతున్నారు..