Weather Alert: ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి.. వానలు దంచి కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని సూచించింది.
కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు కరవు ప్రాంతంగా పేరు గాంచిన అనంతపురం జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. దశాబ్దాలుగా చుక్క నీరు కూడా కనిపించని ప్రాంతాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. అయితే ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు ఉండడంతో అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.
ఇప్పటికే రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవాళ, రేపు సైతం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఎడతెరిపి లేని వానలతో ఇబ్బందులు తప్పడం లేదు. రాబోయే మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.
రానున్న మూడు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అయితే ఇప్పటికే రెండు జిల్లాలను కుండపోత వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. ఇక మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.