P. Anand Mohan, Visakhapatnam, News18. Vanjangi Latest tourist spot in Vizag: ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.. మేఘాలను పట్టుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగే ప్రంతం అది.. ఆ హిల్స్ పై నిలబడితే మేఘాల్లో తేలిపోయే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీనరలు మన కళ్లముందే ఆవిష్కరించే ప్రాంతం అది.. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ సరికొత్త పర్యాటక ప్రాంతంపై పడింది. అసలు ఈ ప్రదేశం ఎక్కడ ఉంది…? ఏంటి దీని ప్రత్యేకత..
సాధారణంగా పౌరాణిక సినిమాల్లో నారదుల వారు తంబుర మీటుతూ.. మేఘాల్లోంచి అలా వెళ్లిపోతుంటే.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళిస్తుంటే.. భలే అనిపించేది. అయితే అదంతా సినిమా డైరక్టర్లు.. కెమెరా ట్రిక్ అని తెలిసిందే.. కానీ అలాంటి మేఘాలు.. అది కూడా ధవళ వర్ణం మేఘాలు ముద్దాడుతుంటే.. నింగి తలుపులు తెరుచుకుంటూ సూరీడు చొరబడుతుంటే.. చెప్తుంటేనే మేఘాలలో తేలిపోయే ఫీలింగ్ కలుగుతోందా.. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ వాలిపోండి.
పచ్చని కొండలన్నీ బంగారం తాపడం చేసినట్టు మెరిసిపోతుంటే.. ఏ తనువు మాత్రం మురిసిపోదు? అలాంటి అనుభవాలకు కొడైకెనాలో.. కులుమనాలో వెళ్లిపోనక్కర లేదు. విశాఖ జిల్లా వంజంగి కొండల్ని పలకరిస్తే చాలు.. పాల సంద్రం లాంటి పొగమంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే ఇది ఎక్కకో కాదు.. విశాఖపట్నం జిల్లాలో ఉంది.. విశాఖపట్నం నుంచి వంద కిలో మీటర్ల దూరం లో ఉంది.
వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 4,500 అడుగుల ఎత్తులో ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం ప్రకృతి ప్రియులకు స్వర్గధామం. ఏడాది వ్యవధిలో సుమారు 2 లక్షలకు పైగానే పర్యాటకులు వంజంగి హిల్స్‌ను సందర్శించారు. మారుమూల వంజంగి పంచాయతీ శివారు గ్రామాలకు వంజంగి హిల్స్ వరంగా మారింది. గిరిజనులకు జీవనోపాధి కల్పిస్తోంది.
సూర్యాదయం చూడాలి అంటే...
ఎత్తయిన కొండలు, సూర్యోదయం, పచ్చని చెట్లు ఇక్కడ బాగా ఆకట్టుకుంటున్నాయి. దానికి తోడు సూర్యోదయం గురించి ప్రత్యేకంగా చెప్పుకునే తీరాలి. ఉదయం 5 గంటల 40 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. దీనిని చూడడానికి ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్య లో వస్తున్నారు. చలికాలంలో ఈ ప్రదేశాన్ని తప్పక చూడాల్సిందే…! అందమైన మంచు లో కాసేపు సరదాగా గడపాల్సిందే..!
విశాఖ అందాలలో సరికొత్త మణిహారం
ఇప్పటి వరకు విశాఖపట్నం జిల్లాలో అరకు లంబసింగి హిల్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఈ జాబితాలో ఇది కూడా చేరింది. పాడేరు కి ఇది ఆరు కిలో మీటర్లు మాత్రమే. ఇక్కడ ట్రెక్కింగ్ చేసుకోవడానికి ట్రెక్కర్స్ విపరీతంగా వస్తున్నారు. మంచు, ప్రకృతి, కొండలు అందమైన ఊరు సూర్యోదయం ఇవన్నీ చెప్పుకుంటే కంటే చూస్తేనే బాగుంటుంది. పదాల్లో ఎంత చెప్పిన చూస్తేనే దాని అందం తెలుస్తుంది. మరి ఒక ట్రిప్ వేసేసి… వనజంగి ఎంత బాగుందో తెలుసుకోండి.
పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వ కృషి
వంజంగి హిల్స్ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వంజంగి హిల్స్ ప్రకృతి అందాలను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ సూర్యోదయం, పాల సముద్రం లాంటి మంచు అందాల దృశ్యాలను ఫొటోలు, వీడియోల రూపంలో చూపించడంతో ఆయన స్పందిస్తూ పర్యాటక శాఖ ఉన్నతాధికారులను వంజంగి హిల్స్‌కు పంపించారు.
పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రాంప్రసాద్, డీఎం ప్రసాదరెడ్డిల బృందం వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధిపై సమగ్ర సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వంజంగి హిల్స్‌కు వస్తున్న పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు అంచనాలను రూపొందిస్తోంది. త్వరలోనే దీన్ని పూర్తి పర్యాటక కేంద్రంగా డవలప్ చేసేందుకు పర్యాటక శాఖ ప్లాన్ చేస్తోంది.
మళ్లీ మళ్లీ వచ్చి చూస్తారు..
వంజంగి హిల్స్‌లోని పాల సముద్రం లాంటి మంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. రాత్రంతా అడవిలో మకాం వేసి తెల్లారకముందే బోలెంగమ్మ శిఖరానికి చేరుకుని సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించాక ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అని ఇక్కడకు వచ్చిన పర్యాటకులు చెబుతున్నారు. మళ్లీ మళ్లీ తప్పక వస్తామంటున్నారు.
వంజంగి హిల్స్‌కు ఎలా వెళ్లాలంటే..
విశాఖపట్నం నుంచి పాడేరుకు 117 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం 3 గంటలు. పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో వంజంగి కొండలున్నాయి. పాడేరు నుంచి వంజంగి హిల్స్ జంక్షన్ వరకు పక్కా తారురోడ్డు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వంజంగి హిల్స్‌గా పేరొందిన బోనంగమ్మ కొండ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు మట్టి రోడ్డు ఉంది. జంక్షన్ నుంచి బోనంగమ్మ కొండకు కాలినడకన సమయం గంటన్నర నుంచి రెండు గంటలు.
దగ్గరుండి మేఘాలను చూడాలి అంటే.. తెల్లవారుజామున 4 గంటల సమయానికే బోనంగమ్మ కొండకు పర్యాటకులు చేరుకోవాలి. రాత్రి బస చేసేందుకు ఎలాంటి కాటేజీలు లేవు. స్థానిక గిరిజనులు టెంట్లను అద్దెకు ఇస్తున్నారు. పాడేరులో లాడ్జీలు అందుబాటులో ఉన్నాయి. వంజంగికి ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. పర్యాటకులు సొంత వాహనాల్లోనే వస్తుంటారు. పాడేరు పట్టణంలోని కార్లు, ఆటోలు మాత్రం ముందుగా బుక్ చేసుకుంటే అద్దెకు వస్తాయి.
తినడానికి పలు రకాల చికెన్ వంటకాలు, అల్పాహారం, నూడుల్స్, నీళ్లు అమ్ముతారు. పాడేరు నుంచి 46 కిలోమీటర్ల దూరంలో అరకులోయ, 30 కిలోమీటర్ల దూరంలో జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం, 60 కిలోమీటర్ల దూరంలో లంబసింగి పర్యాటక ప్రాంతాలున్నాయి. పాడేరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యగుండం క్షేత్రం, పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయం, ఘాట్‌లోని కాఫీ తోటలు, అమ్మవారి పాదాలు గుడి, అక్కడ నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఎత్తయిన డల్లాపల్లి ప్రాంతాలు పర్యాటక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి.