Corona Effect On MBBS Exams: కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాచుతోంది. సెకెండ్ వేవ్ తో పోలిస్తే విద్యార్థులు ఈ సారి భారీగా కరోనా బారిన పడుతున్నారు. తొలి రెండు వేవ్ ల సమయంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో వారు సేఫ్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు సెలవులు ఇవ్వడానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో.. భారీగా విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో వైద్య విద్యార్థుల జీవితాలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చెలగాటమాడుతోంది.
వందల సంఖ్యలో విద్యార్థులు కరోనా బారినపడుతున్నా పట్టించుకోకుండా మరో మూడు రోజుల్లో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 600మందికి పైగా వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. అయితే ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని.. ఉధృతి తగ్గేవరకూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వారం రోజులుగా ఈ-మెయిల్ ద్వారా వేలాది వినతి పత్రాలు పంపుతున్నారు..
ఇప్పటికే రెండు వేలకు పైగా మెయిల్స్ వచ్చాయి.. కానీ యూనివర్శిటీ అధికారులు స్పందించడం లేదు. కరోనాతో సంబంధం లేదు పరీక్షలు నిర్వహించి తీరాల్సిందే అంటున్నారు.. ఎంబీబీఎస్ మొదటి ఏడాది విద్యార్థులకు ఈ నెల 28నుంచి, రెండో ఏడాది వారికి ఫిబ్రవరి 1నుంచి , మార్చిలో మూడో సంవత్సరం విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను సిద్ధం చేశారు.
మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 3 వేల మంది విద్యార్థులు పరీక్షకు హజరుకావాల్సి ఉంది. వీరిలో ఇప్పటికే 600 నుంచి 700 మంది ఇప్పటికే కొవిడ్ సోకి వారం రోజులుగా క్వారంటైన్లో ఉంటున్నారు. వీరు కాకుండా రోజువారీగా పదుల సంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో పరీక్షలు వాయిదా వేయాల్సిన వర్సిటీ అధికారులు మొండిపట్టుతో ఉన్నారని విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థులు వచ్చినా, రాకపోయినా పరీక్షలు నిర్వహిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు అధికారులు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల మంది విద్యార్థులు కొవిడ్ బారినపడితే ఇప్పుడు పరీక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. ఏడాదంతా కష్టపడి చదివినా ఇప్పుడు పాజిటివ్ కావడంతో పరీక్షలు రాయలేకపోతున్నామని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం థర్డ్‌వేవ్‌లో వైద్యులు, వైద్య విద్యార్థులు గుంపులు గుంపులుగా కొవిడ్ బారినపడుతున్నారు. కడప ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 52 మంది, ఒంగోలులో 36 మంది, చిత్తూరులో 50 మంది, అనంతపురంలో 30 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రయివేటు మెడికల్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.
ఇలాంటి సమయంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి పరీక్షలు వాయిదా వేసి కరోనా తగ్గిన తర్వాత నిర్వహించాలని సూచిస్తున్నారు. ఒక్క ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో హెల్త్ వర్సిటీలు పరీక్షలను ఎప్పుడో వాయిదా వేసుకున్నాయి.
పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ సుమారు 2వేల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వర్సిటీ, డీఎంఈ అధికారులకు ఈ-మెయిల్స్ పంపించారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఎంబీబీఎస్ మొదటి ఏడాది ఫెయిల్ అయితే రెండో ఏడాదిలోకి అనుమతించరు. భవిష్యత్తులో స్పెషాలిటీ కోర్సుల్లోకి ప్రవేశించేందుకు కాంపిటీటివ్ పరీక్షలు రాసే అవకాశం కూడా ఉండదు. ప్రభుత్వ, ప్రయివేటు బోధనాస్పత్రుల్లో పరిస్థితిని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సమీక్షించి, పరీక్షలను వాయిదా వేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.