అలాగే 5 లక్షల ఎకరాలకు సాగునీరును స్థిరీకరించాం. ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కావలి నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని.. దేవుడి దయవల్ల వరుసగా నాలుగో ఏడాదికూడా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయన్నారు. రైతన్నల మోములో చిరునవ్వులు కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు.
అక్షరాల రూ.320 కోట్లకు పైగా ఈరెండు బ్యారేజీలకు ఖర్చు చేశామని గుర్తు చేశారు. బ్రిటిష్ వారి హయాంలో కట్టిన ఈ ఆనకట్ట కాలక్రమేణా శిథిలావస్థకు చేరుకుంది. అప్పట్లో ఏ ఒక్కరూ కూడా నెల్లూరు జిల్లాకు మంచి చేయాలని ఆలోచన చేయలేదని.. కానీ ప్రియతమ నాయకుడు, వైయస్సార్ సీఎం అయిన తర్వాతనే ఈ జిల్లాకు మోక్షం వచ్చిందన్నారు.
2006లో పనులు మొదలు పెట్టారు. ఆ పెద్దాయనకు కొడుకుగా, ముఖ్యమంత్రిగా ఈరోజు మళ్లీ ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టును తాను పూర్తి చేశానని చెప్పడానికి గర్వపడుతున్నాను అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. తండ్రి హఠాన్మరణం తర్వాత ఈ బ్యారేజీలను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
2014లో మళ్లీ రాష్ట్రం విడిపోయాక.. ఇక్కడ ప్రభుత్వం వచ్చింది. వచ్చాక.. ఈ బ్యారేజీ పనులకోసం కేవలం 30 కోట్ల 85లక్షలు ఖర్చుచేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. 2017 నాటికి అని., 2018 నాటికి అని, 2019 నాటికి అని చెప్పి.. మహూర్తాల మీద మహూర్తాలు పెట్టుకుంటూ మార్చుకుని పోయారు తప్పా చేసింది ఏమీ లేదన్నారు.
గౌతం పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని బ్యారేజీకి పేరు పెట్టాం. గౌతం సంస్మరణ కార్యక్రమంలో చెప్పిన మాటను నిలుపుకుంటూ.. ఇవాళ బ్యారేజీకి పేరుపెట్టి, జాతికి అంకితం చేశాను అన్నారు. నెల్లూరు బ్యారేజీకి కోసం ఆ రోజు వైయస్సార్.. సుమారు రూ.80 కోట్లుకు పైగా ఖర్చు చేశారన్నారు. ఆయన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. ఇవాళ దాన్ని కూడా పూర్తిచేసి జాతికి అంకితం చేశామన్నారు.