MLA Roja clarified: వైసీపీ అధినేత, సీఎం జగన్ కు వీర విధేయురాలిగా రోజాకు గుర్తింపు ఉంది. జగన్ తనకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అని ఆమె పదే పదే చెబుతున్నారు. కానీ అలాంటి రోజా.. వైసీపీ అధిష్టానంపై అలక వహించారా..? ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారా..? గత రెండు రోజులుగా ఈ వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. అయితే ఈ వార్తలపై రోజానే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
శ్రీశైలం ఆలయ పాలకమండలిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి నియమించింది. చక్రపాణిరెడ్డి ఛైర్మన్గా 15 మంది సభ్యులతో పాలకమండలి ఖరారు చేసింది. తన వైరి వర్గానికి కీలక పదవులు రావడంతో నగరి ఎమ్మెల్యే రోజా అలకబూనినట్లు వార్తలు వచ్చాయి.
ఆలయ ఛైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. తాను వద్దని పదే పదే కోరినా.. చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురైనట్లు ఆమె అనుచరులే అంటున్నారు. తన మాట లెక్క చేయకుండా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంతో ఆమె అలకబూనినట్లు వార్తులు వచ్చాయి.
కానీ వైసీపీపై అలక వహించినట్టు వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే రోజా స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు, పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్న పార్టీకి మేలు జరిగేలానే ఉంటాయని అన్నారు.