ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట పెళ్ళిసందడి నెలకొంది. మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్ సందీప్ వివాహ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. గురువారం నాడు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరై.. బొత్స తనయుడు డాక్టర్ సందీప్, వధువు పూజిత లను ఆశీర్వదించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, సినీ ప్రముఖులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ వేడుకలో రాజకీయపార్టీలకి అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం. ఏపీ మంత్రి ఆహ్వానం మేరకు ఈ వేడుక కు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందులో ప్రధానంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
చిరంజీవి వేదిక పైకి రావటంతోనే పలువురు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయినా, మంత్రి బొత్సా ఆహ్వానించటంతో వచ్చి కాబోయే వధూ వరునుల ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడీ ఫొటోలు వైరల్ గా మారాయి. మంత్రి బొత్సా, మెగాస్టార్ చిరంజీవి వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. ఇద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కూడా కావడంతో.. చిరంజీవి, బొత్సా మధ్య మంచి అనుబంధమే ఉంది.
ఈ నిశ్చితార్ధ వేడుకలో మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు సైతం హాజరయ్యారు.
ఘనంగా జరిగిన కార్యక్రమానికి రాజకీయ రంగ అతిరధ, మహారధులు అందరూ హాజరయ్యారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులంతా హాజరయ్యారు. మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, సహా చాలా మంది మంత్రులు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా మెరిసారు.
వైఎస్సార్సీపీ నేతలు దాదాపు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రముఖులంతా సుమారు వచ్చారు. రాజకీయ ప్రముఖుల్లో మాజీ ఎంపీ కేవిపి రామచంద్రరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హైదరాబాద్ లోనే ఈ నిశ్చితార్ధం జరుగుతుండడంతో.. ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ నేతలు కూడా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.
తెలంగాణ నుంచి హరీష్ రావు, కేశవరావు, బండ్ల గణేష్ హాజరై సందడి చేసారు. జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శాసనమండలి సభ్యులు డాక్టర్ సురేష్ బాబు, పార్వతిపురం నియోజకవర్గ శాసనసభ్యులు అలజంగి జోగారావు, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య తో సహా జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ వేడుకకు హాజరై డాక్టర్ సందీప్, పూజిత లను ఆశీర్వదించారు..
అనుబంధాలు వేరు, రాజకీయాలు వేరు అన్నట్టుగా ప్రముఖులంతా హాజరయ్యారు. ఏ పార్టీలో ఉన్నా, రాజకీయాలలో ఉంటూ తిట్టుకున్నంత మాత్రాన కలవక మానరనేది రుజువయింది. మంత్రి బొత్స కూడా ఆయన కుమారుడి నిశ్చితార్థ వేడుకని ఘనంగా నిర్వహించారు. ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా నేతలు అంతా ఓ దగ్గర చేరడం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో సన్నిహితంగా ఉన్న చాలామంది రావడంతో అంతా కోలాహలంగా మారింది.