Maha ShivaRatri 2022: మహా శివరాత్రి అంటే పరమ పవిత్రమైనదిగా హిందువులు భావిస్తున్నారు. ఆ రోజు శివ నామస్మరణ చేసినా చాలు ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అన్నది భక్తుల నమ్మకం.. ఇక శివాలయాలకు వెళ్లి.. అక్కడ అభిషేకం నిర్వహిస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని నమ్ముతారు.. అయితే తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పంచారామాలు, ఇతర శైవ క్షేత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ఇలాంటిది మాత్రం ఇంకెక్కడా ఉండదు.
సాధారణంగా శివుడికి భూమిమీద విగ్రహ రూపంలో చాలా ఆలయాలు ఉంటాయి. అందులో అత్యధికంగా శివయ్యను లింగాకారం (Shiva Linga)లో భక్తులు పూజిస్తారు. శివుడు విగ్రహ రూపంలో దర్శనం ఇచ్చే పుణ్యక్షేత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకొన్నవారు కానీ దర్శించలేరు అని నమ్ముతారు.
ఇక్కడ శివుడు తలకిందులుగా దర్శనం ఇవ్వడానికి కారణం ఏంటంటే..? యమధర్మ రాజు శివుడి గురించి తపస్సు చేస్తున్నసమయంలో శివుడు తలకిందులుగా తపస్సు చేస్తుంటే.. పార్వతి పసిబాలుడైన సుబ్రమణ్యస్వామిని ఒడిలో లాలిస్తుందట. యముడు తపస్సు చేస్తూ.. ఉన్నపళంగా శివుడిని ప్రత్యక్షం కమ్మని వేడుకొన్నాడట.. యముడి కోరికను మన్నించిన శివుడు.. సతీ సమేతంగా యదాస్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానికులు చెబుతుంటారు.
శివుడు యమధర్మరాజుకి ప్రత్యక్షమై ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద క్షేత్రం ఏర్పడుతుందని… ఆ క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని.. అప్పటి నుంచి యముడు, శివుడు లయకారులన్న భయం ప్రజలకు పోయి… ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇచ్చాడట.. ఆ ప్రభావంతోనే ఇక్కడ ఆలయం వెలసిందని తమ పూర్వీకులు చెప్పినట్టు పండితులు చెబుతున్నారు.
ఈ గుడిలోని శివుడిని పూజిస్తే… దీర్ఘరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. యనమదుర్రు గ్రామం పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తలకిందుల శివుడిని దర్శించుకోవడానికి యనమదుర్రు చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి.. భీమవరం నుంచి బస్సులో ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.