Jagananna Vidya Kanuka: వేసవి విరామం తరువాత విద్యార్థులంతా మళ్లీ.. బ్యాగ్.. బుక్స్ పట్టుకొని స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలా సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న... ఈ తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది.
విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. మన బడి నాడు నేడు కింద వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ ఏటా విద్యారంగానికి బడ్జెట్లో వేల కోట్లు కేటాయింపులు చేస్తున్నారు. బడులు తెరిచిన తొలిరోజే జగనన్నవిద్యాకానుక క్రింద అందజేస్తున్నారు. ఈ విద్యా కానుకులో ఇచ్చే వస్తువులు ఏంటంటే..? 1. ప్రతి విద్యార్ధికి ఉచితంగా 3 జతల యూనిఫాం క్లాత్ కుట్టుకూలితో సహా, 2. ఒక జతల బూట్లు, 3. రెండు జతల సాక్సులు, 4. బెల్టు, 5. స్కూలు బ్యాగు, 6. బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, 7. నోట్‌బుక్స్. 8. వర్క్‌బుక్స్‌తో పాటు అదనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీని ప్రభుత్వం అందజేస్తుంది.
స్కూల్స్ ప్రారంభమవుతున్న రోజునే.. ఈ కిట్లు అందిస్త.. బోధనకు ఇబ్బంది ఉండదని సీఎం భావించారు. అందుకే తొలిరోజే విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు చదువుతున్న 47,40,421 మంది విద్యార్ధినీ, విద్యార్ధులకు 931.02 కోట్ల రూపాయల ఖర్చుతో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా లాంఛనంగా కర్నూలు జిల్లా ఆదోనిలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ జరుగనుంది.
జగనన్న విద్యా కానుక కింద అర్హులైన ప్రతీ విద్యార్ధికీ దాదాపు 2,000 విలువైన జగనన్న విద్యా కానుక ద్వారా అందనున్నాయి. 2020 –21 విద్యా సంవత్సరంలో 42,34,322 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం 648.10 కోట్ల రూపాయలు. 2021 –22 విద్యా సంవత్సరంలో 45,71,051 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందగా, దానికి అయిన వ్యయం 789.21 కోట్ల రూపాయలు. 2022 –23 విద్యా సంవత్సరంలో 47,40,421 లక్షల మంది విద్యార్ధులు లబ్ధి పొందనున్నారు. దీనికి వ్యయం 931.02 కోట్ల రూపాయలు అవుతోంది.
ఇక విద్యారంగంలో సంస్కరణలపై ప్రభుత్వం 36 నెలల్లోనే భారీగా వ్యయం చేసింది. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల సంఖ్య 44,48,865 లక్షలకు గాను అందించిన మొత్తం రూ. 19,617.53 కోట్లు. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకమే లేదు. జగనన్న విద్యా దీవెన లబ్ధిదారుల సంఖ్య 21,55,298 లక్షలు, జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల సంఖ్య 18,77,863 లక్షలకు గాను, రెండింటికీ కలిపి అందించిన మొత్తం రూ. 11,007.17 కోట్లు. గత ప్రభుత్వంలో ఇచ్చినవే.
ఈ పథకం అర్హతలు ఇవే
అయితే అమ్మ ఒడిలా ఈ పథకం అందరికీ వర్తించదు. విద్యా కానుక కింద ప్రయోజనం పొందాలని భావించే వారికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులందరూ ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు. ఉచితంగా కిట్లు అందిస్తారు. చదువుకు సంబంధించిన అవసరమైన సామాగ్రి ఉంటుంది.