YSR Rythu Bharosa: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నారు. ఈ రంగంలో ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు క్రమం తప్పకుండా రైతు భరోసా నగదును ఎప్పటికప్పుడు అకౌంట్లలోకి వేస్తున్నారు. ఇప్పుడు నాలుగో ఏడాది రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేయనున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు 2,096.04 కోట్ల రూపాయల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు.
ప్రస్తుతం రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో 13,500 రూపాయల సాయం ప్రభుత్వం అందిస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే 7,500 చొప్పున ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో విడత అందించనుంది. అలాగే సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో 2,000 సాయాన్ని అందచేయనుంది.
భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు 7,000 కోట్ల రూపాయల భరోసా ఇస్తోంది ప్రభుత్వం.
అలాగే సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తోందని మంత్రులు చెబుతున్నారు.
రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని తెచ్చింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, ఐదు రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటించింది.
నేడు సీఎం పర్యటన ఇలా
రైతు భరోసా నగదు విడుదలను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రారంభించనున్నారు. సీఎం జగన్ ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు. 10.45 – 12.10 వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ వెంటనే వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
నగదు రాకపోతే ఇలా చేయండి: మీకు అన్ని అర్హతలు ఉండి.. రైతు భరోసా నగదు అందకపోతే.. వెంటనే స్థానిక సచివాలయాల్లో సంబంధింత సిబ్బందిని కలిసి.. మీ పట్టాదారు పుస్తతకం.. వ్యక్తిగత వివరాలను అందించాలి.. ఒకసారి వారు వెరిఫై చేసిన తరువాత.. మీరు అర్హులు అనుకుంటే.. నగదు రావడం ఎందుకు ఆలస్యం అయ్యింది అన్నది చెబుతారు.. లేదా మళ్లీ ఆ సాయం అందిలా చర్యలు తీసుకుంటారు.