ఆంధ్రప్రదేశ్ లో భానుడి భగ భగలు సెగలు పుట్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల 45 డిగ్రీల మార్కును కూడా టచ్ చేస్తోంది. ఓ వైపు కరోనా సెకెండ్ వేవ్ పంజా.. మరోవైపు మాడు పగిలే ఎండలు.. దీంతో చాలామంది ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వస్తోంది. అయితే ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తమకు విరుగుడు దొరికింది అంటూ సరికొత్త ఫిలాసఫీ చెబుతున్నారు మందుబాబులు.
మాడు పగిలేలా చేస్తున్న వేసవి తాపాన్ని తట్టుకోలేక మద్యం బాబులు ఔషదంలా చల్లచల్లని బీర్ తో గొంతును తడుపుకుంటూ పూర్తిగా రిలీప్ అవుతున్నారు. ఇటీవల బీర్ల విక్రయాల లెక్కలు చూస్తే తెలుస్తోంది బీరుకు ఎంత డిమాండ్ పెరిగింది అన్నది. గత మూడు నెలల్లో లిక్కర్ కు పోటీగా బీర్ల అమ్మకాలు ఊహించని స్థాయిలో పెరిగాయి. జనవరిలో 33 లక్షల ఐఎంఎల్ కేసులు అమ్ముడుపోగా అందులో 28 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యాయి. ఇక ఫిబ్రవరిలో చూస్తే 29 లక్షల కేసుల ఐఎంఎల్ అమ్మకాలు జరిగితే అందులో 22 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.
సాధారణంగా ఏపీలో బీర్లకు పెద్దగా డిమాండ్ ఉండదు. కానీ ఈ వేసవి తాపం నుంచి బయటపడేందుకు చల్లటి బీర్లు తాగేవారి సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. మద్యం ప్రియులు సైతం అదే మాట చెబుతున్నారు. గతంలో లిక్కరు ఎక్కువగా తీసుకునే వాళ్లమని.. కానీ ఇప్పుడు వేడి ఎక్కువగా ఉండడంతో చల్ల పడేందుకు బీరు తాగాల్సి వస్తోంది అంటున్నారు.
గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదంటున్నారు ఎక్సైజ్ అధికారులు. ఎండలు తీవ్రంగా ఉన్నా మందుబాబులు ఎక్కువగా లిక్కర్కే మొగ్గుచూపుతారు. కానీ ఈ ఏడాది విచిత్రంగా లిక్కర్ అమ్మకాలను దాటి బీరు విక్రయాలు జోరందుకున్నాయి. గతంలో ఉన్నపాపులర్ బ్రాండ్ల బీర్లు ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో లేవు. ముఖ్యంగా కింగ్ఫిషర్, నాకౌట్, బడ్వైజర్ వంటి బ్రాండ్ల బీర్లు అక్కడక్కడా మినహా ఎక్కువ షాపుల్లో అందుబాటులో ఉండటం లేదు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా తెరపైకి వచ్చిన బూమ్ బూమ్, బీరా, బ్లాక్ బస్టర్ లాంటి కొత్త బ్రాండ్లే షాపుల్లో ఉంటున్నాయి. అయినా వినియోగదారులు వేరే దారిలేక వాటినే కొనుగోలు చేస్తున్నారు. గతంతో పోలిస్తే బీర్లు ధరలు కూడా బాగా పెరిగాయి. గత ప్రభుత్వంలో ఒక్కో బీరు ధర 100 నుంచి 120 ఉంటే.. ఇప్పుడు కనీసం రూ.220కు చేరింది. ఆ స్థాయిలో ధరలు పెరిగినా ఎండల్లో లిక్కర్ తాగలేక వినియోగదారులు బీరుకు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరుగుతోంది.