పువ్వుల లుంగీ.. చిరిగిన చొక్కాతో పాత బైక్ మీద తిరుగుతున్న ఓ వ్యక్తి రెండు ఫెర్టిలైజర్ షాపులకు వెళ్లాడు. తనను తాను రైతుగా పరిచయం చేసుకుంటూ ఎమ్మార్పీ రేటు గురించి ఆరా తీశాడు. దానికి ఆ షాపు యజమానుల నుంచి నిర్లక్ష్యం సమాధానం వచ్చింది. తీసుకుంటే తీసుకో లేదంటే పో.. రేటు మా ఇష్టం వచ్చినంత అమ్ముతామంటూ సమాధానం చెప్పారు.. అంతే కాసేపటికే ఆ రెండు షాపులు సీజ్ అయ్యాయి.. దీంతో ఆ రైతు ఎవరా అని షాపు యజమానులు షాక్ కు గురియ్యారు..
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ మారు వేషంలో నగరంలో పర్యటించారు. సబ్ కలెక్టర్ మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపుల్లో తనిఖీలు చేపట్టారు. సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఓ దుకాణంలో వెళ్లి ఎరువులు కావాలని అడిగారు. అయితే స్టాక్ ఉన్నా షాప్ యజమాని లేవని చెప్పారు. సబ్ కలెక్టర్ అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని అడిగారు.
అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో అక్కడి రైతులను వాకబు చేశారు. MRP ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి అతనిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.
గతేడాది విజయనగరం జాయింట్ కలెక్టర్ కిశోర్ కుమార్ ఇలాగే మారు వేషంలో అకస్మిక తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంపై ఆయన మారువేషంలో తనిఖీలకు వెళ్లారు. పంచె,బనియన్ ధరించి సాధారణ వ్యక్తిలా మార్కెట్కు వెళ్లారు. అక్కడ కూరగాయలు విక్రయిస్తున్నవారి నుంచి ధరల గురించి ఆరా తీశారు. కొంతమంది వ్యాపారులు ఎక్కువ ధరలకు కూరగాయలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వచ్చిన వ్యక్తి జాయింట్ కలెక్టర్ అని తెలిసి వ్యాపారులు అవాక్కయ్యారు.