ముందుగా స్వామి వారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేసి, ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉపఆలయాలు, ఆలయప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారు.. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపుకోపు, శ్రీచూర్ణం, కస్తూరిపసుపు, పచ్చకర్పూరం, గంధంపొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణం చేస్తారు.
అనంతరం స్వామి వారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను ఉదయం 11గంటలకు సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ....ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
ఆలయ గోడలకు,పై కప్పులకు సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పరిమళాన్ని గోడలకు అంటించి పరిశుభ్రం చేస్తామన్నారు. ఆలయ అర్చకులు గర్భాలయంను శుద్ది చేసే సమయంలో స్వామి వారిని పూర్తిగా నూతన వస్త్రంతో కప్పి వేస్తామని....అనంతరం గర్భాలయంను అర్చకులు శుభ్రం చేస్తే, మిగిలిన ఆలయంను ఆలయ సిబ్బంది శుభ్రం చేస్తామన్నారు.