Brahmotsavalu: తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా శ్రీరామ నవమి వేడులు జరిగాయి.. రాముడి ఆలయాలన్నీ కిటకట లాడాయి. తెల్లవారు నుంచి రాత్రి వరకు శ్రీ రామ కీర్తనలతో ఆలయ ప్రాంగణాలు అన్నీ మారుమోగాయి. అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
ఈ ఆలయానికి పురాతన, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. ఎక్కడా లేని విధంగా ఒకే శిలపై సీతారామ లక్ష్మణ దేవతామూర్తులు ఉండడంతో ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు. సాధారణంగానే ఒంటిమిట్టల సీతారామలు దర్శనం భాగ్యం ఎంతో పుణ్యం అని భక్తులు భావిస్తారు. అయితే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యం వస్తుందని నమ్ముతారు.
మరోవైపు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం దగ్గర నిర్వహించిన పోతన భాగవతం కవి సమ్మేళనం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోతన సాహిత్య పీఠం కార్యదర్శి శ్రీ నారాయణ రెడ్డి ‘రుక్మిణి సందేశం’, డా.బి.గోపాలకృష్ణ శాస్త్రి ‘శ్రీరామ జననం’, డా.కె.సుమన ‘సీతారామ కళ్యాణం’, శ్రీ పి.శంకర్ ‘భక్తరసం’, శ్రీ వి.చిన్నయ్య ‘కుచేలోపాఖ్యానం’, శ్రీ ఎం.లోకనాథం ‘శరణాగతితత్వం’ అనే అంశాలపై ఉపన్యసించారు.
పురాణాల ప్రకారం ఆలయ చరిత్ర:
శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో శ్రీరామచంద్రునిగా అవతరించాడు. సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యంలో సంచరిస్తుండగా సీతాదేవి దప్పిక తీర్చేందుకు భూమిలోనికి బాణం వేయగా నీరు బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్ట రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం జాంబవంతుడు సహకరించాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు.
శాసనాల ప్రకారం ఆలయ చరిత్ర :
ఈ ఆలయాన్ని మూడు దశల్లో నిర్మించారని, 14వ శతాబ్దంలో నిర్మాణం ప్రారంభమై 17వ శతాబ్దంలో పూర్తయిందని ఇక్కడున్న శాసనాల ద్వారా తెలుస్తోంది. ఉదయగిరిని పాలించిన కంపరాయలు ఈ ప్రాంతంలో ఒకసారి సంచరిస్తాడు. వేట మీద జీవనం సాగించే వంటడు, మిట్టడు ఇక్కడికొచ్చిన కంపరాయలకు, ఆయన పరివారానికి శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీరుస్తారు.
వీరిరువురి కోరికపై కంపరాయలు ఆలయాన్ని నిర్మించి ఒంటిమిట్ట గ్రామాన్ని ఏర్పాటుచేస్తాడు. క్రీ.శ 1356లో బుక్కరాయలు ఈ ఆలయాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో విజయనగరరాజులు, మట్లిరాజులు క్రమంగా గుడికి అంతరాళం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురం, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుపక్కల గ్రామాల రాబడిని ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. వావిలికొలను సుబ్బారావు భిక్షాటన చేసి విరాళాలు సేకరించి ఆలయానికి పూర్వ వైభవం తెచ్చారు.