కడప జిల్లా సిద్ధవటంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం కౌలు భరోసా యాత్ర నిర్వహించారు. సీఎం సొంత జిల్లాలో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కడప విమానాశ్రయం నుంచి సిద్ధవటం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌పై అభిమానులు పూల వర్షం కురిపించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం వైఎస్సార్సీపీకే సీఎం అని.. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాదంటూ పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినా.. వారు బాగుపడ్డారే కానీ, రాయలసీమ బాగు పడలేదన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కుల పిచ్చి ఎక్కువైందని.. తానెప్పుడూ కులాల గురించి మాట్లాడలేదన్నారు.
కులం, మతాలపై రాజకీయాలు సరికావంటూ పవన్ కల్యాణ్ అన్నారు. తన కుటుంబంలోని వ్యక్తిని కూడా జగన్ చేతులు పట్టుకునేలా చేశారని ఆయన విమర్శించారు. చేతులు కట్టుకుని సీఎం ముందు నిలబడేలా చేశారంటూ ఆవేదన చెందారు. కాంగ్రెస్‌లోకి ప్రజారాజ్యం పార్టీ విలీనం చేయకుండా ఉండుంటే పరిస్థితులు వేరేలా ఉండేవని పవన్ కల్యాణ్ అన్నారు.