ఆరు అంచెల కొత్త విధానంలో ఏపీలో ఈ విద్యా సంవత్సరం అమలు కానుంది. పునాది విద్యను బలోపేతం చేసేందుకు పీపీ1, పీపీ2లతో కూడిన శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లతో ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హైస్కూలు, హైస్కూల్ ప్లస్‌గా ఈ స్కూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు విలీన ప్రక్రియ పూర్తయిన ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లు, ప్రీ హైస్కూళ్లకు తరలించేందుకు విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు కూడా జారీచేసింది.
బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5 నుంచి నెలాఖరు వరకు విద్యాకానుక కిట్లను విద్యార్ధులకు అందజేస్తారు. ప్రభుత్వం మూడో ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ హైస్కూల్ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు.
Jagananna Vidya Kanuka: వేసవి విరామం తరువాత విద్యార్థులంతా మళ్లీ.. బ్యాగ్.. బుక్స్ పట్టుకొని స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అలా సిద్ధమవుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న... ఈ తరుణంలో విద్యార్ధుల కోసం జగనన్న విద్యాకానుక కిట్లను మూడో ఏడాది అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది.
అదే సమయంలో, స్కూళ్లకు వెళ్లే బాలికల డ్రాపౌట్ రేట్‌ను తగ్గించాలన్న లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షల మందికిపైగా విద్యార్ధినులకు ‘స్వేచ్ఛ’ పథకం ద్వారా ఏటా రూ. 32 కోట్ల వ్యయంతో నెలకు 10 చొప్పున ఏడాదికి 120 నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
ఏపీలో మరో ప్రతిష్టాత్మక పథకం నాడు- నేడు మొదటి దశలో 15,715 స్కూళ్ళ బాగు కోసం రూ. 3,669 కోట్లు- ఖర్చు చేసి, రెండో దశలో 22,344 స్కూళ్ళను బాగు చేసే కార్యక్రమాన్ని చేపడుతోందని, ప్రపంచస్ధాయిలో పోటీ-పడేలా మన పిల్లలను సన్నద్దం చేసేందుకు దేశంలోనే అతి పెద్ద ఎడ్యుకేషనల్ -టె-క్ కంపెనీ బైజూస్‌తో ఒప్పందం చేసుకుందని సర్కారు తెలిపింది.
ప్రతి ఏటా రూ. 24 వేల వరకు ఖర్చయ్యే ఈ స్డడీ మెటీ-రియల్ను ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు ఉచితంగా అందించాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతిలో చేరబోతున్న 4.7 లక్షల మంది విద్యార్ధులకు రూ. 500 కోట్ల ఖర్చుతో రూ. 12 వేల విలువ చేసే ట్యాబ్‌లు ఉచితంగా ఈ సెప్టెంబర్ నెలలోనే ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు.