P. Anand Mohan, Visakhapatnam, News18,
GVMC New Commissioner Success Story Dr. Lakshmisha: ఒకప్పుడు ఆయన పేపర్ బాయ్.. ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్.. కడు పేదరికంలో పుట్టారు. ఆకలి తీర్చుకోవడమే కష్టంగా ఉండే రోజుల నుంచి ఇప్పుడు జిల్లాను శాసించే స్థాయిలో ఉన్న అధికారిగా ఎదిగారు. మరి ఇది ఆయనకు ఎలా సాధ్యమైంది.
పేదరికంతో పోటీ పడిన విజయాన్ని ఎలా అందుకున్నారు.. అంటే ప్రోత్సాహం, పట్టుదల.. పగే కారణమంటున్నారు. ఎవరికైనా సంకల్పం ఉంటే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చని ధైర్యంగా చెపుతున్నారు జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన తన ప్రయాణంపై ఎన్నో ఆసక్తికర విషయాలు చెబుతున్నారు.
రోజంతా కష్టపడి.. తన ఇద్దరు పిల్లలకు పెట్టి.. ఆ తరువాత మిగిలేది మాత్రమే ఆ తల్లి తినేది. అమ్మ చూపిస్తున్న ప్రేమను మనసులో పెట్టుకున్న లక్ష్మి శ.. తనను వెక్కిరించిన పేదరికాన్ని దాటుకుంటూ వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్‌గా.. తర్వాత ఐఏఎస్ అధికారిగా సాగారు. ఆయితే తన ప్రతి అడుగులోనూ అమ్మ ఆశీస్సులే నడిపిస్తున్నాయని చెబుతున్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రయాణం..
అప్పట్లో వ్యవసాయ డిగ్రీకి ఎక్కువ క్రేజ్ ఉండేదని, ఈ డిగ్రీ పూర్తి చేస్తే బ్యాంకులో ఉద్యోగం వస్తుందని చెప్పేవారు. అందుకే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకున్నాను అంటున్నారు. డిగ్రీ తరువాత జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ రావడంతో ఎమ్మెస్సీ కోసం అలహాబాద్ వెళ్లాను అన్నారు. అక్కడి నుంచి పీహెచ్డీ కోసం ఢిల్లీ వెళ్లి.. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో సీనియర్ ఫెలోషిప్ వచ్చిందని. అగ్రికల్చర్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా ప్రయాణం ప్రారంభించాను అన్నారు. అయితే మధ్యలో సైకాలజీ కూడా చదివడంతో తన జీవితం మరో మలుపు తిరిగింది అంటున్నారు.
మూలాలు మరిచిపోని అధికారి
ఎక్కడి నుంచి తన ప్రయాణం ప్రారంభమైందో తాను ఎప్పటికీ మరిచిపోను అంటున్నారు. అందుకే సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఐఏఎస్ అధికారిగా మారాను అన్నారు. పార్వతీపురంలో పనిచేసినప్పుడు అక్కడ గిరి గ్రామాలు చూస్తే.. సొంత ఊరిలో ఉన్నట్లుగానే అనిపించింది అన్నారు. అందుకే ఎక్కడ పనిచేసినా ఆ ప్రాంతంలోని అన్ని సామాజిక వర్గాలను అభివృద్ధి చేయాలన్న కాంక్షతో ముందడుగు వేస్తాను అంటున్నారు.
నాలుగో ప్రయత్నంలో అద్భుత విజయం
ఎట్టకేలకు నాలుగో ప్రయత్నంలో 2013లో 275వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఏపీ క్యాడర్‌కు ఎంపికయ్యాను అంటున్నారు. దీంతో తన ఆనందానికి అవధులు లేవన్నారు. తన కంటే అమ్మ పడిన సంతోషం ఎప్పటికీ వెలకట్టలేనిది అంటున్నారు. కర్నూలు జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకొని కృష్ణా జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్‌గా మొదటి పోస్టింగ్ వచ్చిందని. తర్వాత పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా.. ఇప్పుడు ఇలా జీవీఎంసీ కమిషనర్ బాధ్యతలు చేపట్టాను అన్నారు.
పేపర్ బాయ్‌గా 300 రూపాయల జీతం
చిన్నతనంలో అనుభవించిన పేదరికంపై పగతోనే పగలు రాత్రి కష్టపడి చదివేవాడిని అన్నారు. ఇంటర్ చదివే సమయంలో తన ఖర్చుల కోసం ఇంటిపై ఆధారపడకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. అందుకే తన ఫ్రెండ్స్‌తో కలిసి పేపర్ బాయ్‌గా చేరాను అన్నారు. నెలకు 300 ఇస్తే.. వంద రూపాయిలు అమ్మకు ఇచ్చి.. మిగిలిన 200 తన ఖర్చులకు ఉంచుకునేవాడిని అన్నారు. ఉదయం 4 గంటలకు లేచి పేపర్ వేసి.. మళ్లీ తయారై.. కాలేజీకి వెళ్లేవాడిని. ఇంటర్ పూర్తయ్యేంత వరకు ఇలాగే చేశానని నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.