Chalo Vijayawada: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల వార్ తీవ్ర స్థాయికి చేరింది. కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టిన ఉద్యోగ సంఘాలు.. ఈ నెల 7వ తేదీని నిరవధికి సమ్మకు పిలుపు ఇచ్చారు. దీనిలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడు పిలుపు ఇచ్చారు నేతలు. అయితే ఈ ఛలో విజయవాడకు అనుమతి లేదన్న పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. విజయవాడ వైపు ఎవరూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ పట్టువీడని ఉద్యోగులు ఉప్పెనలో విజయవాడ చేరుకున్నారు.
కరోనా ఆంక్షలు నేపథ్యంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ఉద్యోగులను విజయడాకు అనుమతించేది లేదని పదే పదే పోలీసులు చెబుతూ వచ్చారు. అందుకే నిన్న రాత్రి నుంచే ఆంక్షలు విధించారు.. ఎక్కడిక్కడ ఉద్యోగులను అడ్డుకున్నారు. కీలక నేతల ఇంటి దగ్గర కూడా పోలీసుల పహారా పెట్టారు.. నిన్న రాత్రి నుంచి అనుమానం వచ్చినవారందర్నీ అదుపులోకి తీసుకున్నారు. అయితే భారీగా ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు.
రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ చలో విజయవాడ వైపే.. విజయవాడలో రహదారులన్నీ బీఆర్టీఎస్ రోడ్ల వైపే.. ఒక్కసారిగా ఉద్యోగులు ఉప్పెనలా తరలిరావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. బీఆర్టీఎస్ మీసాల రాజేశ్వరరావు వంతెన దగ్గర నుంచి పీఆర్సీ సాధన సమితి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీకి అగ్రభాగాన పీఆర్సీ సమితి ముఖ్య నేతలు నిలిచారు. అంత మంది ఒక్కసారిగా రావడంతో పోలీసులు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది.
విజయవాడకు వచ్చే రహదారులు అన్నింటిలో పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి.. ఎవరీనీ అడుగు పెట్టనీయకుండా అడ్డుపడ్డారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఉద్యోగులు ఊహించని సంఖ్యలో విజయవాడ చేరుకోగలిగారు.
న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతుంటే తమపై ఆంక్షలు ఎందుకు అని ఉద్యోగులు, సంఘం నేతలు నిలదీస్తున్నారు. తమ ఛలో విజయవాడకు అనుమతి ఇచ్చి ఉంటే.. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునే వెళ్లేవారిమని.. కానీ ఇలా నేరస్తుల్లా తమపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధకరంగా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీగా సాగుతున్నారు ఉద్యోగులు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్ర చేస్తున్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తున్నారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించారు ఉద్యోగులు.
ఉద్యోగులను అడ్డుకొనేందుకు పోలీసులు భారీగా మోహరించారు. చెక్ పోస్టులు, జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీలు చేసి ఉద్యోగులయితే.. వారిని వెనక్కి పంపుతున్నారు. అయితే పోలీసుల కళ్లుగప్పి మారు వేషాల్లో ఉద్యోగులు విజయవాడకు చేరుకోవడంతో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్తితులు కనిపిస్తున్నాయి.