దక్షిణ ఒడిశా కోస్తా ప్రాంతం ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర కోస్తా ఒడిశా పరిసర ప్రాంతాలలో అల్పపీడనంగా మారి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ పైన విస్తరించి ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి వైపు వంగి ఉందని.., రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, జబల్పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంత కేంద్రం ఉత్తర ఒడిశా, పొరుగు ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో గురు, శుక్ర శనివారాల్లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నట్లు తెలిపింది. అలాగే దక్షిణ కోస్తాలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే వరదల కారణంగా గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జూలై నెలలో భారీ వరద సంభవించింది. ధవళేశ్వరం బ్యారేజీకి దాదాపు 16లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే ధవళేశ్వరం వద్ద రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన భద్రాతలంలో గోదావరి నీటిమట్టం 58.5 అడుగులకు చేరింది.
భారీ వర్షాలకు గోదావరి నది పొంగిపొర్లడంతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రం పూర్తిస్థాయిలో నీట మునిగింది. గోష్పాద క్షేత్రంలో ఉన్న శివాలయం సాయిబాబా మందిరం పూర్తిగా నీటమునిగాయి. గోష్పాద క్షేత్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాట్లు చేసి పోలీసులు 24 గంటలు ప్రహారా కాస్తున్నారు.