ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారానికి ఏపీ తీరం వైపునకు పయనించే అవకాశం ఉంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో.. రాబోయే మూడు రోజులు కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇక మరో మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు జిల్లాలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోనూ కొన్ని చోట్ల భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సోమ, మంగళ వారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.
ముఖ్యంగా ఇవాళ.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ సహా ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు మొదలయ్యాయి కూడా.. విశాఖలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవొచ్చు.. ఇక అనంతపురం జిల్లాలో ఈ రోజు భారీ వానలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు హుకుంపేట (కడప జిల్లా)లో 3.5 సెం.మీ., కపిలేశ్వరపురం (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా)లో 3.2, చాట్రాయి (ఏలూరు)లో 3.1, రాజానగరం (తూర్పుగోదావరి)లో 3, ఆళ్లగడ్డ (నంద్యాల జిల్లా)లో 2.9, జగ్గంపేట (కాకినాడ జిల్లా) 2.6, గొలుగొండ (అనకాపల్లి జిల్లా)లో 2.3 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది..