Tirupati Heavy Rains: అమ్మో వానా.. వరద.. ఎటు చూసినా వరదే.. కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి. రోడ్లు ఏవో.. చెరువులు ఎవో తెలియడం లేదు. తిరుమల, తిరుపతి రెండూ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుండపోత వానతో తిరుపతి ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. భారీ వాన ఎఫెక్ట్ కలియుగ వైకుంఠం శ్రీనివాసుడు సన్నిధిపైనా పడింది. క్యూ కాంప్లెక్స్ ల్లోకి వరద నీరు రావడంతో ఆ ఎఫెక్ట్ భక్తులపై పడింది..
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో ఎప్పుడూలేని విధంగా కుండపోత వాన కురుస్తూనే ఉంది. ఆకాశానికి ఏమైనా చిల్లు పడిందా అనే అనుమానం కలిగింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చిత్తూరు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
భారీ వానతో తిరుమలలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారింది. ఇంట్లోంచి బయటకు రావాలి అంటే భయపెడుతోంది. ప్రయాణం చేయాలంటే నరకం తప్పదేమో అనిపించే ఉంది. తిరుమల ఘాట్రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కొండల్లో నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
వీధులు నదులయ్యాయి. వరద నీటి ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోయాయి. ఇది తిరుపతి నగరంలో కనిపిస్తున్న దృశ్యాలు! వాయుగుండం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు పెద్దగండం తెచ్చిపెట్టింది. తిరుమల-తిరుపతి అతలకుతలమయ్యాయి. వాయుగుండం ప్రభావంతో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కురుస్తున అతిభారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక చెరువులకు గండ్లు పడ్డాయి. పలు రహదారులు నీటమునిగి రాకపోకలు నిలిచిపోయాయి.
రెండు రోజుల పాటు కుండపోత వానతో తిరుపతి ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిరుపతిలోని శివజ్యోతినగర్, మంగళం, పద్మావతిపురం, శ్రీనివాసపురం, శ్రీపురం, లక్ష్మీపురం కాలనీలను వరద చుట్టుముట్టింది. లోతట్టు ప్రాంతంలోని ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద భారీగా చేరింది. రైల్వే అండర్బ్రిడ్జిల దగ్గర భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్ మళ్లించారు. పలు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు మునిగాయి.
తిరుమలలోనూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద మొత్తం లడ్డూ కౌంటర్ వద్ద నుంచి నాలుగు మాడవీధుల్లోకి చేరుకుంది. దీంతో మాడవీధుల్లో పెద్దఎత్తున బురద పేరుకుపోయింది. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయితే, శ్రీవారి ఆలయం సమీపంలో నీరు త్వరగా వెళ్లిపోయే మార్గాలు ఉండడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడలేదు. అదే విధంగా తిరుమలలోని ఆర్జిత సేవ కార్యాలయంలోకి నీరు ప్రవహించడంతో సర్వర్లన్నీ స్తంభించిపోయాయి. అదేవిధంగా అదనపు ఈఓ ధర్మారెడ్డి క్యాంప్ కార్యాలయం పూర్తిగా నీటమునిగింది.
కుండపోత వర్షంతో తిరుపతి నగరం పూర్తిగా నీట మునిగింది. కాలువల ఆక్రమణలతో వరద నీరు ప్రవహించేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నగర వీధులను వరద నీరు ముంచెత్తింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం, లీలామహల్ నుంచి కరకంబాడికి వెళ్లే రహదారి, ఎయిర్ బైపాస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతూనే ఉన్నారు. రాత్రికి వరద ఉద్ధృతి మరింత పెరగడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించారు. తిరుపతి ఎస్వీయూలో భారీ వృక్షాలు కూలడంతో హెచ్టీ విద్యుత్తు లైన్లు తెగిపోయాయి. రామచంద్రాపురం- తిరుపతి మధ్య వాగులు భారీగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచాయి. నగరంలోని ప్రజలెవరూ ఇంటినుంచి బయటకు రావద్దని అర్బన్ ఎస్పీ వెంకటఅప్పలనాయుడు హెచ్చరించారు.
తిరుపతి సమీపంలోని ఎన్టీఆర్, కల్యాణి డ్యాంలలోకి భారీగా వరద వస్తుండడంతో గేట్లు ఎత్తివేశారు. 30ఏళ్ల తరువాత కల్యాణి డ్యాం మూడో గేటును కూడా తెరిచి 10వేల క్యూసెక్కులను వదిలారు. దీంతో కల్లేటి వాగు, సువర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పలు చెరువులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పీలేరు బస్టాండు మునిగింది.
తిరుపతి గ్రామీణ మండలం హరిపురం, జనార్ధన, నలందానగర్, నెహ్రూ కాలనీలు నీటి మునిగాయి. పేరూరు చెరువు నుంచి కాలనీల మీదకు వరద ముంచుకొచ్చింది. తిరుచానూరు సమీపంలోని నక్కల కాలనీ నీటమునగడంతో తమనెవరూ పట్టించుకోవడం లేదంటూ స్థానికులు పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో జాతీయరహదారిపై భారీగా వాహనాలు నిలిచాయి. శ్రీకాళహస్తి మండలం కొత్తూరు, కుంటిపూడి గ్రామాలు మునిగాయి. కుప్పం పరిధిలో వందలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది.