Tirumala Heavy Rains Pics:ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పై వరుణుడు పగబట్టాడా..? గత కొన్ని రోజుల నుంచి తిరుపతి-తిరుమలలో ఎడతెరిపి లేని వానలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో తిరుపతి నగరం తడిసి ముద్దవుతోంది. జలవిలయానికి గజగజా వణుకుతోంది. ప్రస్తుతం నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.
కేవలం తిరుమల, తిరుపతిలో నే కాదు.. చిత్తూరు జిల్లా మొత్తం భారీ వానలకు వణికిపోతోంది. ఎస్ఆర్ పురం మండలం లో 79.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మధురానగరిలో వర్షం నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. ఈ భారీ వర్షానికి జంగాలపల్లి పాపిరెడ్డి పల్లి యు. ఎం పురం, పాతపాలెం జిఎంఆర్ పురం లో నీరు పొంగి పొరలడంతో వాగులు దాటలేక , పాఠశాల విద్యార్థులు స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. జంగాలపల్లె వాగు దాటలేక ఓ ఇంటి వద్ద ,ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులోనే బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు ప్రజలు.
సుమారు 15 గ్రామాలకు పైగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వీధులు నదులయ్యాయి. వస్తువులన్నీ పడవల్లా తేలిపోయాయి. వరద నీటిలో వాహనాలు బొమ్మల్లాగా కొట్టుకుపోయాయి. ఇది తిరుపతి నగరంలో కనిపించిన దృశ్యం.. తీవ్ర వాయుగుండం చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలను గజ గజా వణికేలా చేస్తోంది. వాన కాస్త తెరిరిపిచ్చిన ఇంకా నగరాలు నీట మునిగే ఉన్నాయి. ముఖ్యంగా తిరుమల -తిరుపతి అతలకుతలమయ్యాయి. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు పొంగి ప్రవహిస్తున్నాయి.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో గత రెండు రోజులుగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎడతెరపి లేని వర్షంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలోని నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది.. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా.. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతంలోని జలపాతాలు మత్తడి దూకుతున్నాయి.
తిరుమలలో రోడ్లు, అండర్‌వే బ్రిడ్జీలు పూర్తిగా చెరువుల్లా మారాయి.. వాహనం రోడ్డెక్కాలి అంటే భయపడేలా చేస్తున్నాయి. జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు వరద నీటిలో చిక్కుకుపోగా.. కొన్ని చోట్ల వరద ధాటికి తట్టుకోలేక పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందలు ఎదుర్కొన్నారు. ఇక పలు చోట్ల రోడ్ల మీద, ఇళ్లలో చేరిన వరద నీటిలో జనాలు ఈత కొట్టారు.
తిరుపతిలో పరిస్థితి దారుణంగా మారడానికి ప్రధాన కారణం ఇదే అంటున్నారు నిపుణులు.. బంగాళాఖాతానికి సమీపంలో ఉండటంతో వర్షాల ప్రభావం ఈ ఆధ్యాత్మిక నగరంపై ఉంటుంది. తిరుపతి నుంచి తడ 100 కి.మీ.లోపు దూరం మాత్రమే. మరో ముఖ్య కారణం ఏంటంటే.. రాయలవారి కాలంలో తిరుపతిలో అనేక గుంటలను తవ్వించారు. కానీ తుమ్మలగుంట, కేశవాయనగుంట, మల్లయ్య గుంట, తాతయ్యగుంట, తాళ్లపాక చెరువు, కొరమీనుగుంట తదితర ప్రాంతాలన్నీ ఆక్రమణకు గురయ్యాయి.
ఆర్టీసీ బస్టాండును తాళ్లపాక చెరువుపై, కూరగాయల మార్కెట్‌ను మల్లయ్య గుంటపై నిర్మించడంతో వర్షపునీరు రోడ్లపైకి వస్తోంది. అక్కడే ఉన్న పెద్ద జలవనరు తాతయ్యగుంట పూర్తిగా మాయమైంది. కపిలతీర్థం, మాల్వాడిగుండం నుంచి వచ్చే జలపాతం నీరంతా తిరుపతికి అడ్డంగా ప్రవహించి తిరుచానూరు దక్షిణ భాగంలోని స్వర్ణ ముఖి నదిలో కలుస్తుంటుంది. అయితే ఈ కాల్వలన్నీ కుచించుకుపోవడంతో కాలువల్లో ప్రవహించేనీరు రోడ్లపైకి చేరడంతో పాటు లోతట్టు ప్రాంతాల గృహాలన్ని నీటమునుగుతున్నాయి.
తిరుపతి నగరం భౌగోళికంగా భిన్నమైంది. పడమర, తూర్పు ప్రాంతాలు ఎత్తుగా ఉంటాయి. ఉత్తర ప్రాంతం కొండలు. నీరు దక్షిణంగా ప్రవహించాలి. అయితే జలవనరుల విధ్వంసంతో వరదనీరు అక్కడే నిలిచిపోతోంది. తూర్పు ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. దీంతో నీరు పోవడంలేదు. పట్టణ ప్రణాళిక కూడా సరిగా లేకపోవడం మరో కారణం. కొండల పైనుంచి వచ్చే వరద నీటితో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు తిరుపతి ప్రజల్లో భయం..భయమే.
ముఖ్యంగా తిరుపతి నగరానికి సుమారు 20 కిలోమీటర్ల ప్రాంతంలో కురిసే వర్షపు నీరంతా అంతర్గత కాల్వల ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా వైఫల్యంతో సమస్య మరింత కఠినంగా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీరు ప్రవహించే కాలువల్లో సరిగా పూడిక తీయకపోవడం, రైల్వే అండర్ బ్రిడ్జిల ప్రాంతాల్లో నాలాలు పూడిపోవడంతో ప్రమాదంగా మారుతున్నాయని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షం కారణంగా రెండు ఘాట్ రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి.
ఘాట్ రోడ్డులలో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడితే.... మరి కొన్ని చోట్ల లోపలకు రోడ్డు కృంగిపోయాయి. వరద ఉధృతికి కొండ చరియలు విరాగిపడ్డాయి. దీంతో ఘాట్ రోడ్డుపై భారీ ఎత్తున మట్టి పేరుకు పోయింది. కొన్ని చోట్ల పిట్ట గోడ కూలిపోగా... మరికొన్ని చోట్ల నడక మార్గంలోని బండలు ద్వంసం అయ్యాయి.
తిరుపతి సమీపంలో హృదయ విధారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంత్యక్రియలు కూడా అతి కష్టం మీద చేయాల్సి వస్తోంది. మృతి చెందిన వ్యక్తికి అంతిమ సంస్కారం చేయడం కష్టంగా మారింది. నది దాటితే కాని అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పాడింది. గ్రామానికి చెందిన 74 ఏళ్ల వ్యక్తి అనారోగ్యం కారణంగా మరణిస్తే.. ఆయన అత్యంక్రియలు నిర్వహించేందుకు గ్రామానికి శ్మశానానికి మధ్య ఉన్న స్వర్ణముఖి నదిని తాడు సహాయంతో దాటి అంత్యక్రియలు నిర్వహించారు.
భారీ వరద కారణంగా చంద్రబాబు నాయుడు ఇళ్లు కూడా నీట మునిగింది. చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారి పల్లెలోని చంద్రబాబు నివాసంలోకి భారీగా వరద నీరు చేరింది. వరద నీరును బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా కంట్రోల్ కావడం లేదు. ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా రోడ్లు ఒక్కసారిగా జలమయం అయ్యింది. ఒక్కసారిగా వరద నీరు పెరగటంతో చంద్రబాబు నివాసంలోకి భారీగా వరద నీరు చేరుకుంది.