Good News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముఖ్యంగా వైద్య, విద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రెండింటిని పేదవారికి దగ్గర చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారు. తాజాగా వైద్య రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందించడంలో భాగంగా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు సీఎం జగన్.
గ్రామీణ పేద ప్రజలకు, గ్రామాలను సందర్శించే ప్రభుత్వ వైద్యాధికారులకు మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కాన్సెప్ట్ తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ కాన్సెప్ట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణ బాబు ప్రకటించారు.
నిపుణుల కమిటీ సిఫార్సులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, భాగస్వాములతో సమగ్రంగా చర్చలు జరిపిన తరువాతే సెకండరీ, టెరిటరీ ఆస్పత్రులపై పెరుగుతున్న రోగుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు. అలాగే గ్రామం ఒక యూనిట్‌గా ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ వసతులను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఫ్యామిలీ ఫిజిషియన్ విధానానికి శ్రీకారం చుట్టామన్నారు.
ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ (Family Doctor) విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అయితే రానున్న జనవరిలో పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి (Health Officer), ఆయనతో పాటు మరికొంత మంది సిబ్బందితో కూడిన బృందం గ్రామీణ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గ్రాను గ్రామ ఆరోగ్య కేంద్రాలను నెలకు రెండుసార్లు సందర్శించనున్నారు.
గ్రామంలో ఎవరికైనా సమస్యలుంటే.. అక్కడే వైద్య సేవలు అందిస్తారు. దీంతోపాటు రిఫరల్ చికిత్సలు, ఆరోగ్య శ్రీ సేవలను కూడా సమన్వయం చేసుకుంటారని ఆరోగ్యశాఖ సెక్రటరీ తెలిపారు. ప్రారథమిక ఆరోగ్య పరిరక్షణా రంగం మౌలిక స్వరూపాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని, ప్రతి రెండు వేల మందికి ఒక విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలోనే వారికి నిరంతర వైద్య సేవలు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు.
సాధారణంగా ఆర్థిక స్థితి మెరుగ్గా ఉన్న కుటుంబాల ప్రత్యేకంగా వైద్యుడిని తమ ఫ్యామిలీ డాక్టర్‌గా ఎంచుకుంటారు. కుటుంబంలో ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా, వెంటనే ఆ వైద్యుడిని మాత్రమే నిత్యం సంప్రదిస్తూ ఉంటారు. అలాగే చేస్తే వారి మెడికల్ హిస్టరీ తెలిసిన డాక్టర్ గా.. ఆ జబ్బును త్వరగా గుర్తించడం, చిన్న చిన్న జబ్బులు అయితే ప్రాథమిక వైద్యం చేయడం, స్పెషలిస్ట్ వైద్యం అవసరం ఉంటే రెఫర్ చేయడం.. ఇలా వారి ఆరోగ్యం పట్ల వైద్యుడు నిరంతరం ఫాలోఅప్‌లో ఉంటాడు.
అలా చేయడం ద్వారా ఆ కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్యంపై వైద్యుడికి సమగ్ర అవగాహన ఉంటుంది. ఆ కుటుంబానికి మెరుగైన వైద్య సంరక్షణ సమకూరుతుంది. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లోనే వారి ఆరోగ్య పరిస్థితిని ఫ్యామిలీ డాక్టర్ ఎప్పటికప్పుడు పరిశీలించి.. తగు జాగ్రత్తలు సూచించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజా విధానం ద్వారా గ్రామాల్లో నెలలో రెండు సందర్శనలు చేపట్టడానికి వీలుగా 432 ఎంఎంయూలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు ఒక సందర్శన ద్వారానే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు. అయితే వీలున్న చోట వీటి ద్వారానే రెండు సందర్శనలు చేపట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చాక జనవరిలో పూర్తి స్థాయి సేవలు అందించే యోచనలో ఉంది ప్రభుత్వం.