Karthika Masam 2022: కార్తీకమాసం అంటూ శివుడికి అత్యంత ప్రీతికరమైనది.. అందుకే ఈ నెలలో నిత్యం శివలయాలు శివ నామ స్మరణతో మారుమోగుతాయి. ముఖ్యంగా శివుడంటే కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా నమ్మకం. అందుకే హిందువులు (Hindus) శివయ్యను వివిధ రూపాల్లో కొలుస్తుంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వివిధ పేర్లతో శివాలయాలు వెలిశాయి.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం నరసింగపాడులో అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. నల్లమల ప్రాంతానికి అతి సమీపంలో శివుడు స్వయంభువుగా వెలిశాడు. 1794 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. గుత్తికొండ బిలంలో తపస్సు ఆచరించే సిద్దులు, మునులు నిశి రాత్రి సమయంలో నరసింగపాడు వచ్చి కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు చేసేవారని ప్రతీతి.
ఈ నరసింగపాడు గ్రామంలో నీరు పాతాళగంగలా ఉద్భవిస్తుంది. ఏ కాలంలోనైనా ఈ ప్రాంతంలో నీరు పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు ఇక్కడ పాడిపంటలకు ఆ కాశీవిశ్వేశ్వరుడి దయ వల్ల ఎలాంటి లోటు లేదని గ్రామస్తులు చెబుతుంటారు. వర్షాలు పడినా పడకపోయినా, కాలువలు వచ్చినా రాకపోయినా నీటి కొరత ఉండదని …ఏడాది పొడవునా ఇక్కడ రైతులు పంటలు వేస్తుంటారు.
సిద్దులు పూజించిన శివలింగం కావటంతో కోరిన కోర్కెలు సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. ఒక్కసారైనా స్వామి వారిని దర్శించి సేవించాలని భావిస్తుంటారు. ఇక్కడ సాంబశివుడిని కొలిచి ప్రదక్షిణలు చేస్తే పుత్ర సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. మరొక విశేషం ఏటంటే బాలారిష్ట దోషాలు ఉన్న వారు ఇక్కడ అభిషేకం చేయించుకుంటే తొలగిపోతాయని నమ్మకం.
పల్నాడు బ్రహ్మనాయుడు కొడుకు బాల చంద్రుడుకి పుట్టుకతోనే దోషాలు ఉన్నాయని అవి తొలగి పోవటానికి ఇక్కడే పూజలు చేయించారని పల్నాడు వాసులు విశ్వసిస్తారు. ఆ తర్వాతే బాల చంద్రుడు పల్నాటి యుద్దంలో పాల్గొని వీరవంతుడిగా కొలవబడ్డాడని ప్రతీతి. ఈ ఆలయంలో కాల సర్పదోష పూజలు కూడా జరగుతాయి. ఇక్కడ కొలువైన అన్నపూర్ణ దేవి దక్షిణ ముఖంగా ఉంటుంది. సాధారణ దేవాలయాల్లో అమ్మవారు తూర్పు లేదా ఉత్తర ముఖంగా కొలువై ఉంటారు.
కార్తీక మాసంలో వివిధ కుటుంబాలకు చెందిన భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేస్తుంటారు. ఈ ఆలయంలో మార్గశిరమాసంలో శివునికి ఆరుద్రోత్సవములు ఘనంగా జరుపుతారు. ఈ ఉత్సవాలను తిలకించేటందుకు భక్తులు వేలసంఖ్యలో తరలివస్తుంటారు. అయితే దేవాలయంలో ఇంకా మౌలిక సదుపాయాలపై ఇంకాస్త దృష్టిపెడితే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ముఖ్యంగా కార్తీకమాసంలో భారీగా భక్తులు వస్తుంటారు.. సంతానం లేని వారు ఒక్కసారి స్వామిని మనసారా వేడుకుంటే వారి సమస్య నెరవేరుతుందని నమ్ముతారు. మరోవైపు కవిసామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ ఈ స్వామిని దర్శించి పులకించి, కీర్తిస్తూ, మధ్యక్కర ఛందస్సులో శతకాన్ని రచించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇప్పటికీ రుషులు ఇక్కడ సంచరిస్తుంటారని భక్తులు భావిస్తారు.