Good News: ఖరీఫ్ కు ముందే ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.. రైతన్నల్లో ఆర్థిక క్రమశిక్షణ తీసుకు రావడడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా లక్షలోపు పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీనందిస్తూ.. ప్రభుత్వం అండగా ఉంటోంది.
తాజాగా రబీ 2020–21, ఖరీఫ్–2021 సీజన్లకు సంబంధించి అర్హులకు ఈ నెల 29న సున్నావడ్డీ రాయితీని జమ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ఇప్పటికే రబీ 2020–21 అర్హుల జాబితా సిద్ధంకాగా, వాటిని సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో నేటి నుంచి ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. ఖరీఫ్–2021 జాబితా వాలిడేషన్ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది.
వర్షాభావ పరిస్థితులకు తోడు ఇతర సమస్యల కారనంగా అప్పుల ఊబిలో చిక్కుకోకుండా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పిన హామీ మేరకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. పాత రుణాలను గడువులోగా తిరిగి చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీనందిస్తోంది. టీడీపీ హయాంలో చెల్లించకుండా వదిలేసిన బకాయిలు సైతం చెల్లిస్తున్నామని సీఎం జగన్ పదే పదే చెబుతన్నారు.
రబీ 2020–21తో పాటు ఖరీఫ్–2021 సీజన్లలో లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించి అర్హత పొందిన రైతులకు ఈ నెల 29న వడ్డీ రాయితీని జమచేసేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. ఈ–క్రాప్‌లో నమోదైన పంట వివరాల ఆధారంగా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వడ్డీ రాయితీ లబ్ధిని వాస్తవ సాగుదారులకు అందించనుంది.
తాజా జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వెంటనే లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకుని తమ పేర్లు, బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకోవాలని.. ఒకవేళ అర్హత ఉండి తమ పేరు జాబితాలో లేకపోతే పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత బ్యాంకు అధికారులకు అందించాలని కోరుతున్నారు.