ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన పుట్టినరోజు గురించి కాదు.. పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నాను అన్నారు. ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టబోతున్నాం. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధలను చూశా. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలన్నది తమ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు దాదాపు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయి. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు అందిస్తున్నామన్నారు. క్లాస్ టీచర్ చెప్పే పాఠశాలకు ఈ ట్యాబ్‌లు సపోర్ట్‌గా ఉంటాయన్నారు. పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారని. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పేద తల్లిదండ్రుల కష్టాలను చూశానని.. అందుకే మూడున్నరేళ్లలో ఎక్కడా వెనకడుగు వేయలేదని స్పష్టం చేశారు.
పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌ల్లో తొలగించామన్నారు. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ విలువ సుమారు 32 వేల రూపాయలు ఉంటుంది అన్నారు. ట్యాబ్‌ల్లో బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి అందిస్తున్నామన్నారు. 686 కోట్ల రూపాయల విలువైన 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నెట్‌తో సంబంధం లేకుండా పాఠ్యాంశాలు చూసే వెసులుబాటు కల్పించామన్నారు.
తన పుట్టిన రోజు నాడు తనకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి కార్యక్రమంలో పలు పంచుకోవడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. మన పిల్లలు అంటే.. మన తర్వాత కూడా ఉండే మనం. పిల్లలు బాగుండాలని తమకన్నా కూడా బాగా ఎదగాలని, తమకన్నా మంచిపేరు ఇంకా తెచ్చుకోవాలని, ప్రతి తల్లీదండ్రీకూడా మనసారా కూడా కోరుకుంటారన్నారు.