నాగేశ్వరస్వామి ఆలయం:
ఈ ఆలయ గోపురం సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఈ ఆలయాన్ని, గోపురాన్ని దేవభక్తుని సోదరులు కాంతన్న, మూర్తన్న నిర్మించారు. ఆలయం ముందు రెండు శాసనాలు క్రీ.శ. 1231లో జాయప సమయంలో చెక్కించడ్డాయి. ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా హూణులకి, దక్షిణాది రాజులకి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుస్తోంది.
సాయిబాబా ఆలయం
అటు పక్కనే సాయిబాబా ఆలయం.. దాని పక్కనే శ్రీదేవీ, భూదేవీ సమేత శ్రీ రంగనాధ స్వామి దేవాలయం కొలువై ఉన్నాయి. దీనిని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. 2002లో పునరుధ్ధరించారు. అదే కాంపౌండ్లో ఆంజనేయస్వామికి వేరే ఆలయం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయాం ఎదురుగా చతుర్ముఖ బ్రహ్మ ఆలయం ఉంది.
చతుర్ముఖ బ్రహ్మాలయం
బ్రహ్మ దేవుడికి ఆయనకున్న శాపంవల్ల భూమి మీద ఆయనకు ఆలయాలు, పూజలు ఉండవు. అరుదుగా ఉండే బ్రహ్మాలయాన్ని చేబ్రోలులో 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు. దొంగలను చంపిన పాపాన్ని పొగొట్టుకోవడానికి రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయాన్ని ఒక కోనేటి మధ్యలో నిర్మించారు. ఇందులో శివలింగం పైన నాలుగు వైపులా బ్రహ్మ ముఖాలు ఉంటాయి. శివలింగానికి చేసిన పూజలే బ్రహ్మ దేవునికి కూడా చెందుతాయి.
అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం రోజూ భక్తుల సంఖ్య అంత ఎక్కువగా ఉండక పోవటంతో కొన్ని ఆలయాలు మూసి ఉన్నాయి.ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను ఆనవాళ్ళను కాపాడుకోవడంలో మన నాయకులు అశ్రద్ధ వహించడంతో కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కలిగిని ఈ చేబ్రోలు దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం తలిస్తే..గుంటూరు జిల్లా టూరిజం బాగా వృద్ధి చెందుతుందనుటలో ఎటువంటి సందేహం లేదు.