Good New to Students: విద్యారంగంపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) . ఇప్పటికే పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు.. వాటికి సంబంధించి నిధులను కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక (Janananna Vidya Kanuka) కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న వివిధ వస్తువులు మరింత నాణ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలతో ప్రమాణాలకు ఎక్కడా తగ్గకుండా వస్తువులను పంపిణీ చేయించేలా పాఠశాల విద్యా శాఖ దృష్టి సారించింది.
గతంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, 2 జతల యూనిఫారం మాత్రమే ఇచ్చేవారు. అదీ విద్యా సంవత్సరం ఆరంభమై ఏడెనిమిది నెలలు గడిచినా అందేవి కావు. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచే విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందించేలా చర్యలు తీసుకున్నారు.
ఈ కిట్ లో కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు దీటుగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారంతో పాటు నోట్సులు, వర్కు బుక్కులు, షూలు, సాక్సులు, బెల్టులు, బ్యాగులు అందించేలా జగనన్న విద్యా కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రెండు జతల యూనిఫారం కాకుండా మూడు జతలు అందిస్తున్నారు. దీనికి అదనంగా విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీలను పంపిణీ చేయిస్తున్నారు.
బ్యాగులో నోట్బుక్కులు, పాఠ్య పుస్తకాలు అన్నీ పట్టేలా కొత్త టెండర్లో స్పెసిఫికేషన్లు సవరించనున్నారు. పిల్లల షూ సైజులను తీసుకొనేందుకు మండల స్థాయిలో ఆయా కంపెనీల ద్వారా షూ మేళాలు నిర్వహించేలా చేయడమో, లేదా కూపన్లు అందించి ఆయా కంపెనీల దుకాణాలలో వాటిని రీడీమ్ చేసుకొని షూలు పొందేలా చేయడమో చేయాలని ప్రతిపాదించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారానికి జిల్లా.. మండల స్థాయికి ఆయా వస్తువులను చేర్చడం. ఏప్రిల్ 15 నాటికి కిట్ల రూపంలో వాటిని సిద్ధం చేయడం. పాఠశాలలు తెరిచే రోజున విద్యార్థులందరికీ వాటిని పంపిణీ చేయించడం లాంటి వాటిపై ఇప్పటి నుంచే ఫోకస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది విద్యా కానుక అమలు కోసం 958.34 కోట్ల రూపాయలు అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా వేసింది.