GT Hemanth Kumar, Tirupathi, News18. Ganesh Chaturthi 2022: దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే వినాయక చవితి ఉత్సవాలు అంటే ముందుగా అందరూ తెలుసుకోవాల్సింద కాణిపాకం వినాయకుడు గురించే.. ఎందుకంటే కార్యక్రమం ఏదైనా మొదట పూజలు అందుకొనే బొజ్జ గణపయ్యే.. పూజలు మొదలుకొని.. హోమాలు.. ప్రారంభోత్సవాలు.. భూమిపూజలు ఏదైనా ముందుగా ఆయన అనుమతి తీసుకోవలసిందే.. ఆశీర్వాదం పొందవలసిందే.
సహజంగానే గణపతి ధోరణి నిదానమే ప్రధానమన్నట్టుగా కనిపిస్తూ వుంటుంది. ఎప్పుడు చూసినా ప్రశాంతతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లే అంతా ఆయన చుట్టూ చేరుతుంటారు. అందుకే మనం చేసే కార్యాల్లో విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడిని ప్రార్దిస్తుంటాం. అయితే వినాయక చవితి వేడుకలు అంటే ముందుగా తెలుసుకోవాల్సింది.. దేశంలోనే ప్రముఖ వినాయకుడి దేవాలయంగా పేరొందిన కాణిపాకం గురించే.
స్వయంభు వినాయకస్వామి ఇక్కడ వెలిశారు. అంతేకాదు ఇక్కడ సత్యప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన గణనాథుని పుణ్య క్షేత్రం ఇది. స్వామి వారు స్వయంవ్యక్తమై వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో ఎక్కడ జరగని విధంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.. భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రారంభం అయ్యే ఉత్సవాలు వైభంగా నిర్వహిస్తారు ఆలయ అర్చకులు.. మరి కాణిపాకం విశిష్టత ఏంటి..? ఆలయంలో స్వామి వారు ఎలా వెలిశారు..? ఇక్కడ సత్యప్రణాలు ఎందుకు చేస్తారు..?
స్వామి వారు స్వయం వ్యక్తమై ఓ బావిలో వెలసిన దివ్య క్షేత్రమే కాణిపాకం. ఇక్కడ వెలసిన స్వామి వారు భక్తుల కోర్కెలను తీర్చే కొంగు బంగారమై బాసీలుతున్నారు. ఆలయ చరిత్ర ప్రకారం చిత్తూరు జిల్లాలోని బహుదా నదీ తీరంలో వెలసిన లంబోదరుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. పూర్వం విహారపురి అనే ఊరిలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు.
ఈ నేపథ్యంలో ఈ సోదరులు పంటలు పండించుకునేందుకు తమ స్థలంలో ఒక బావిని తవ్వడం ప్రారంభించారు. కొంతలోతు తవ్విన తరువాత అక్కడ ఒక పెద్దరాయి అడ్డు వచ్చింది. దాన్ని పెకళించడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రాయికి పార తగిలింది. వెంటనే రాయి నుంచి రక్తం చిమ్మి ఆ సోదరుల మీద పడిందట. ఆ మరుక్షణమే వారి వైకల్యం పోయింది. ఈ విషయాన్ని వాళ్లు తమ ఊరి ప్రజలందరికీ చెప్పారు.
దీంతో వారంతా బావి దగ్గరకు వచ్చి చూడగా వినాయకుడి రూపం దర్శన మిచ్చిందట. వెంటనే ఆ స్వామికి ప్రజలంతా కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఆ కాయల నుంచి వచ్చిన నీరు ఎకరం(కాణి) దూరం పారిందట. అలా విహారపురికి కాణి పాకం అని పేరు వచ్చింది. క్రమేణా అదే పేరు కాణిపాకంగా మారింది.
స్వామి వారు స్వయంగా వెలిశారని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తుంది మూలవిరాట్ వైభవం.
ప్రపంచంలోనే అరుదైన మహిమ కలిగిన ఆలయంగా వరసిద్ధి వినాయకుడి ఆలయం పేరొందింది. బావిలో ఉద్భవించిన వినాయకుడు పెరుగుతూ వస్తున్నాడు. చోళ రాజుల కాలంలో కాణిపాక ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళతుంగ చోళరాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.