GT Hemanth Kumar, Tirupathi, News18. TTD Online Tickets Demand:కలియుగ వైకుంఠంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది.. ఆయన దర్శన భాగ్యంకోసం కోట్లాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకు తాజా నిదర్శనం ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు.. ఫిబ్రవరి కోటా దర్శనం టోకెన్లు నిమిషాల వ్యవధిలోనే బుక్ అయిపోయాయి అంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
శుక్రవారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు.. 40 నిమిషాల్లోనే పూర్తి అయ్యాయి. రోజుకు 12 వేల చొప్పున భక్తులకు అవకాశం ఇచ్చారు. దీంతో 40 నిమిషాల్లో 3 లక్షల 36 వేల టికెట్లు బుక్ అయ్యాయి.. ఇక ఇవాళ ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేసింది. అయితే అవి కేవలం 8 నిమిషాల్లోనూ పూర్తి అయ్యాయి.
ప్రత్యేక దర్శనం టికెట్లు మొత్త నెలకు విడుదల చేయగా.. సర్వదర్శనం టోకెన్లను మాత్రం కేవలం 15 రోజుల వరకే విడుదల చేశారు. అది కూడా రోజుకు పది వేల చొప్పున అనుమతిచ్చారు. దీంతో లక్షా యాభైవేల సర్వదర్శనం టోకెన్లు కేవలం.. 8 నిమిషాల్లోనూ బుక్ అయిపోయాయి. 15వ తేదీ లోపు దర్శనాలు లభించిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఫిబ్రవరి నెలకు సంబంధించిన టిక్కెట్లను tirupatibalaji.ap.gov.in టీటీడీ వెబ్సైట్ లో ప్రతి నెల విడుదల చేస్తూ వస్తోంది. తాజాగా సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ఉదయం 9 గంటలకు టీటీడీ సర్వదర్శనం టోకెన్లను విడుదల చేసింది.. ఇలా విడుదల చేయడం అలా సర్వదర్శనం టిక్కెట్లు అన్ని హాట్ కేకులా బుక్ అయ్యి పోయాయి.
వైద్య నిపుణులు, వైద్యాధికారులు చెబుతున్న సూచనల ప్రస్తుతం ఆన్ లైన్ లో ఫిబ్రవరి 15వ తేదీ వరకు మాత్రమే సర్వదర్శనం టోకెట్లను అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 15వ తేదీ తరువాత కరోనా వ్యాప్తి పరిస్థితిని అంచనా వేసి సర్వదర్శనం టోకెన్లు సామాన్య భక్తులకు సులభతరంగా అందేలా ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే అంశంపై టిటిడి నిర్ణయం తీసుకోనుంది.