Rayalacheruvu: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను ఇటీవల వానలు ముంచెత్తాయి.. అయితే వరద భయం (AP Floods) ఇంకా వెంటాడుతూనే ఉంది. రాయలసీమలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుపతి (Tirupati) సమీపంలోని రాయల చెరువు కట్టకు పడిన లీకేజీలను పూడ్చడం ఆలస్యం అవ్వడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
రాయలచెరువు దగ్గర వరద పరిస్థితి ప్రభుత్వం తీరుకు నిరసన తెలుపుతూ.. వెంటనే పూడ్చి, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఇటీవల అక్కడ పర్యటించి డిమాండ్ చేశారు. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా మంత్రులు, అధికారులు అంతా అక్కడే ఉండి సహాయ చర్యలు ముమ్మరంగా చేస్తూనే ఉన్నారు. ప్రమాదం తప్పిందని మంత్రులే స్వయంగా హామీ ఇచ్చారు.
రాయల చెరువు (Rayala Cheruvu)పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పనితీరు ప్రశంసనీయం, ప్రమాదకరంగా కురిసిన వర్షాలకు చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు పడినప్పటికీ ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం స్పందించిన తీరు వల్ల చాలా వరకూ నష్టనివారణ చేయగలిగామని, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.
మంత్రుల హామీతో అక్కడి ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ మరోసారి రాయలచెరువు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మరో మూడు చోట్ల నీరు లీకవుతున్నట్టు స్థానికులు గుర్తించారు. ఊట నీరుతోనే చెరువు కట్టకు వరుస లీకేజీలు ఏర్పడినట్టు అంచనా వేస్తున్నారు. నీటి ప్రవాహం ఎక్కువ అయినా.. మళ్లీ భారీగా వానలు పడిస్తే పరిస్థితిమరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు భయ పడుతున్నారు.
ఇప్పటికే రాయల చెరువుకు వరుస లీకేజీలతో దిగువన ఉన్న గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ఎప్పుడు తెగుతుందోనని భయం గుప్పిట్లో బతుకుతున్నారు సమీప గ్రామాల ప్రజలు. చెరువు దగ్గర టన్నుల కొద్దీ బండరాళ్లు, ఇసుక, సిమెంట్ కంకరను తరలించారు. చెరువు మొరవ ప్రాంతంలో లోతు తీసి నీరు బయటకు తరలించేందుకు పొక్లైన్లు పనిచేస్తున్నాయి. అవుట్ ఫ్లో పెంచుతుండటంతో మళ్లీ వర్షాలొచ్చినా ఇబ్బంది లేదని చెబుతున్నారు ఇరిగేషన్ డీఈ వెంకటశివా రెడ్డి.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటీవల తిరుపతి రాయలచెరువును పరిశీలించారు. చెరువు పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న చంద్రబాబు… అవసరమైతే ఐఐటీ నిపుణులతో దీని భద్రతను అంచనా వేయించాలన్నారు. ఈ చెరువు భద్రతపై ప్రజల్లో అనేక ఆందోళనలు ఉన్నాయని.. ఆ ఆందోళనలు తొలగించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే.. ఆందోళన తప్పేలా లేదంటుటన్నారు స్థానికులు.