Ramatirtham: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని పవిత్ర పుణ్యక్షేత్రల్లో ఒకటి రామతీర్థం (Ramatirtham)లోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునఃనిర్మాణానికి ఈ నెల 22వ తేదీ బుధవారం శంకుస్థాపన జరగనుంది. విజయనగరం జిల్లా (Vizainagaram District)లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం గతేడాది వార్తల్లో నిలిచింది. ఎంతో ప్రసిద్ధి ఉన్న ఈ ఆలయంలోనూ విగ్రహాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
గత ఏడాది డిసెంబర్ 28 అర్ధరాత్రి రామతీర్థంలోని బోడికొండపై ఉన్న కోదండ రామస్వామివారి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆలయ తాళాలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి శ్రీరాముడి విగ్రహ శిరస్సును తొలగించి ఎత్తుకుపోయారు. దేవస్థాన అర్చకుడు ప్రసాద్ ఎప్పటిలాగే స్వామివారికి నిత్య కైంకర్యాలు సమర్పించేందుకు ఉదయం పైకి వెళ్లి చూడగా విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి తోటి సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు విచారణ చేపట్టారు.
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సిబ్బంది వచ్చి ఆలయ పరిసర ప్రాంతాలను గాలించారు. అప్పటి జిల్లా ఎస్పీ రాజకుమారి ఆలయంలోని రాముని విగ్రహాన్ని, ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించి నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. కానీ ఏడాది గడుస్తున్నా.. ఇంతవరకూ నిందితులను అరెస్ట్ చేయలేకపోయారు.
ఇక రాముని విగ్రహం ధ్వంసం వివాదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ విగ్రహ ధ్వంసాన్ని ఖండించాయి.
ఇక ప్రతిపక్ష నేత రామతీర్దం పర్యటన పలు వివాదాలకు ,అరెస్టులకు దారితీసింది. రాముని విగ్రహం ధ్వంసంలో ప్రతిపక్ష పాత్ర ఉందని ఆరోపణలు అధికార నేతలు ఆరోపించగా, ఇది వైసీపీ నేతల పనేనని ప్రతిపక్ష టీడీపీ నాయకులు కూడా ఆరోపించారు. ఇలా విగ్రహ ధ్వంసం అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని, వివాదానికి ముగింపు పలికేందుకు నిర్ణయించింది.
వివాదాలు.. విమర్శలు ఎలా ఉన్నాప్రసిద్ద పుణ్యక్షేత్రమైన రామతీర్ధంలోని బోడికొండపై ఉన్న రాముని ఆలయానికి మహర్ధశ పట్టనుంది. విగ్రహాల ప్రతిష్టతో పాటు ఆలయం మొత్తాన్నీ పునః నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
మొత్తానికి ఏడాది తర్వాత పునర్నిర్మితమవుతున్న బోడికొండ ఆలయాన్ని ప్రతిష్టాత్మంగా తీసుకుంది ప్రభుత్వం. బుధవారం ఉదయం 10.08 గంటలకు బోడికొండపై ఉన్న రాముని ఆలయానికి శంకుస్ధాపన జరగనుంది.
టెండర్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. అవసరమైన గ్రానైట్ రాయిని కాంట్రాక్టర్ ఇప్పటికే ఆలయ ప్రాంగణం వద్దకు తరలించారు. పెద్దపెద్ద గ్రానైట్ రాళ్లు, ఇతర నిర్మాణ సామగ్రిని 600 అడుగుల ఎత్తులో ఉండే కొండపైకి సులభంగా తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. శంకుస్థాపన తర్వాత 6 నెలల వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, గతంలో ఉన్న ఆలయం కంటే.. నూతన ఆలయాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దనున్నట్టు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ రామతీర్ధంలోని బోడికొండపై ఉన్న పురాతన ఆలయం ఉన్న చోటే 3 కోట్ల రూపాయల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనుంది. బోడికొండ ఆలయ మెట్ల మార్గం, కోనేరు, ధ్వజ స్తంభం, ప్రాకారం వంటివి అభివ్ళద్ది చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్, పట్టణాభివ్ళద్ది శాఖ మంత్రి ఇతర అధికారులు పాల్గోనున్నారు.