P. Anand Mohan, Visakhapatnam, News18. Cock Fight: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది కోడి పందాలు. బంధువుల రాకపోకలతో గ్రామాలు, నగరాలు కలకలలాడుతాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం సందడి చేస్తుంది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఒకటేంటి మొత్తం హంగామా ఉంటుంది. పండగ అంటే ఇదే అనిపించేలా సందడి కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే.. వీటికి మించి అన్నట్టు పోటా పోటీగా కోడి పందాలు జరుగుతాయి.
ఇప్పటికే చాలా చోట్ల కత్తి కట్టి కదనరంగంలోకి కోడి దూకుస్తోంది. సంక్రాంతి కంటే ముందే బరిలో కాలు దువ్వుతున్నాయి. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం ఎన్నో విశేషాలతో, ప్రత్యేకతలతో కూడి ఉంది. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పందేల సంప్రదాయం ఎక్కువ. సంకురాత్రి పండుగరోజుల్లో లో ప్రత్యర్థిపై విరుచుకుపడేందుకు పందెం కోళ్లు కొక్కొరొక్కో అంటూ కాళ్లు రువ్వుతాయి.
తెలుగు సంప్రదాయం, పౌరుషానికి ప్రతీకగా నిలిచే కోడిపందేలను పండుగ జరిగే మూడురోజులు కోలాహలంగా నిర్వహిస్తారు. సంక్రాంతికి 6 నెలల ముందు నుంచే ఈ పందెం కోళ్లను సిద్ధం చేస్తారు. కోళ్లను పందేనికి సిద్ధం చేసే క్రమంలో ఎంతో శ్రమ, కఠిన శిక్షణ ఉంటుంది. ప్రొటీన్లతో కలిసి చాలా ఖర్చుతో కూడుకున్నఆహారం అందిస్తారు. తరచూ పశువైద్యులకు చూపించి వారి సలహాల మేరకు విటమిన్ మాత్రలు వేస్తారు.
పందెం బరిలో దిగే ప్రతి కోడికి ముందు నుంచే మిలటరీ ట్రైనింగ్ ఇస్తారు. ఒక్కో కోడి పుంజుకు సుమారు 10 వేల నుంచి 30వేల వరకు ఖర్చు చేస్తారు. కోడి పందెంలో రెండు అంశాలు కీలకమైనవి. ఒకటి కోడి జాతి, రెండు దానికి ఇచ్చే శిక్షణ. కోడి పుంజుల్లో తెల్ల నెమలి, కోడి నెమలి, గౌడ నెమలి, కాకి డేగ, నెమలి కక్కెర, నల్ల కక్కెర, రసంగి, గాజు కుక్కురాయి, అబ్రాస్, ఎర్ర డేగ వంటి జాతులు ఉంటాయి. రెక్కల రంగు, ఇతర శారీరక లక్షణాల ఆధారంగా వీటిని వర్గీకరిస్తారు. ఏడాదిన్నర పాటు శిక్షణ ఇచ్చి పందెం బరిలోకి దింపుతారు.
కుక్కుటశాస్త్రం
పందెం రాయుళ్లు పుంజుల్ని బరిలోకి దించేటప్పుడు ఓ ప్రత్యేక శాస్త్రాన్నిఅధ్యాయనం చేస్తారు. దాన్నే కుక్కుటశాస్త్రం అంటారు. అసలు ఈ కుక్కుటశాస్త్రం ఏం చెబుతోంది.! దాని ప్రకారం పందెంకోళ్లు ఎన్ని రకాలు, వాటి తీరుతెన్నులేంటో తెలుసుకుందాం.
కోడి పందేల చరిత్ర ఈనాటి కాదు. అనాదికాలం నుండి శాస్త్రాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. రాయలవారి కాలంలోనూ కోడి పందేల ప్రస్తావన ఉంది. సురవరం ప్రతాపరెడ్డి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర'లో సైతం కోడి పందేల గురించి విపులంగా రాశారు.
సెంటిమెంట్లు ఎక్కువ..ఏ సమయంలో ఏ జాతి పుంజును బరిలోకి దింపితే.. అది గెలుస్తుందో గణాంకాలు వేసి మరీ పందేలు కాస్తారు. కోడి యజమాని పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా కూడా గెలుపోటములు ఆధారపడి ఉంటాయని కుక్కుట శాస్త్రం చెబుతుంది. పందెం వేసే రోజున నక్షత్రాన్ని బట్టి తారాబలం చూసి.. కోడి రంగు, జాతిని ఎంపిక చేసి ఆ రోజున ఏ పుంజుతో పందెం వేయాలో.. ఆ రంగు ఉన్న కోడి పుంజుతోనే పందేలు వేస్తారు.
భోగి సందర్భంగా గౌడ నెమలి, నెమలికి చెందిన పుంజులు గెలుపొందుతాయని.. సంక్రాంతి రోజున యాసర కాకి డేగలు, కాకి నెమళ్లు, పసిమగల్ల కాకులు, కాకి డేగలకు చెందిన పుంజులు గెలుపొందు తాయన్నది నమ్మకం. భోగీ రోజున డేగలు, ఎర్రకాకి డేగలు గెలుస్తాయని పందేళ్లో ప్రావీణ్యం ఉన్న వారి నమ్మకం. ఇక డేగ జాతి కోళ్లు పోరాట పటిమకు ప్రసిద్ధి. ఇవి చూడముచ్చటగా ఉండటంతో పాటు.. చురుగ్గా కదులుతాయి.
నెమలి జాతి కోళ్లు 3 కేజీల వరకు తూగుతాయి. మంచి కండపుష్టి ఉండటంతోపాటు కళ్లు చురుగ్గా ఉంటాయి. కాలి గోళ్లు బలంగా, మొనదేలి ఉంటాయి.
చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ.. బరిలో ఓడి చనిపోయిన కోడి మాంసానికి విపరీతమైన గిరాకీ ఉంటుంది. వేలం పెట్టి మరీ కొనుగోళ్లు జరిపే సందర్భాలు ఉంటాయి. గ్రామాల్లో పందెం కోళ్లను గుర్తించడం ఓ నైపుణ్యంగా భావిస్తారు.
బరిలోకి దింపే ఈ పందెం కోళ్లలో కొన్ని నియమాలు తప్పనిసరి. రెండు కోళ్ల బరవు ఇంచుమించుగా సమతూకం ఉండాలి. ఉండాల్సిన బరువుకన్నా ఎక్కువ తక్కువలు ఉన్నా.. తేడాలొస్తాయి. పందెం పుంజు ఒంటి గట్టితనం అన్నిటికన్నా ముఖ్యం. అందుకే చల్లనీళ్లని నోటిలోకి తీసుకుని కోడిమీదకు ఊదుతారు. అలా చేస్తే దాని శరీరం గట్టిపడుతుందని ఓ నమ్మకం.