Jawad Cyclone Live Updates: జవాద్ తుఫాను తీవ్రంగా భయపెడుతోంది. గంట గంటకు తీవ్రమవుతోంది. ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి తుఫాను తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమైంది. ఊహించినట్లే మలుపు తీసుకుని ఒడిషా తీరాన ఉత్తర ఈశాన్యంగా పయనిస్తూ రేపు మధ్యాహ్నానికి బలహీనపడిపోతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
జవాద్ తుఫాను ప్రభావం ఈ రోజు మాత్రమే ఉత్తరాంధ్ర మీద ఉంటుంది. అక్కడక్కడా భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం తుఫాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తాజా తుపాను ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో 100 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
జవాద్ తుఫాను ఎఫెక్ట్ తో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాతో పాటు గోదావరి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తొలి రోజు భారీ ప్రభావం ఉంటుందని భయపడినా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక మోస్తారు వర్షాలు పడ్డాయి. ఇక విశాఖపట్నం పై ఈ తుఫాన్ ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించలేదు.
ఈ తుపాను విశాఖపట్నం తీరానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్లు, గోపాల్‌పుర్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఊహించినట్టే తుఫాను కదులుతోంది.. ఒడిశాలోని పూరీ జిల్లాలో ఆదివారం తీరం దాటి, తర్వాత బంగాళాఖాతం వైపు వెళ్తుందంటున్నారు ఐఎండీ అధికారులు. తీరం దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అయితే.. దిశ మార్చుకుని ఒడిశా మీదుగా వెళ్తూ తీరం దాటకపోవచ్చనీ చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.
గత అర్ధరాత్రి నుంచే తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. దీంతో.. తీరం వెంబడి గాలుల వేగం పెరిగింది. తీరం వెంబడి గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచాయి. తుఫాను మళ్లీ దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చంటున్నారు అధికారులు.
శనివారం కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయని చెబుతున్నారు. ఉత్తరాంధ్రకు పెను ముప్పు పొంచి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జొవాద్ ఎఫెక్ట్‌తో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీవ్ర తుపానుతో.. పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటించారు.
తుపాను కారణంగా విశాఖ మన్యంలోని అన్ని పర్యాటక కేంద్రాలనూ ఐదో తేదీ వరకు మూసేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 64 సహాయక బృందాలు సిద్ధంగా ఉంచారు అధికారులు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు 46 బృందాలను పంపారు. మరో 18 బృందాలను సిద్ధంగా ఉంచారు.
విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. గోదావరి నదిపై పాపికొండల విహార యాత్రను మూడ్రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పర్యాటక శాఖ డీఎం వీరనారాయణ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 1,735 సహాయక బృందాలను ఏర్పాటుచేసింది. అలాగే, వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో హెల్ప్లైన్లు ఏర్పాటుచేశారు.