అసని తుఫాన్ (Asani Tufan) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీరంవైపు దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్.., తీవ్ర తుఫాన్ గా మారింది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. దీంతో తీరప్రాంత జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ సమీపిస్తుండటంతో మంగళవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ప్రస్తుతం అసని తుఫాన్ విశాఖపట్నం తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో, ఒడిశా తీరానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈనెల 10నాటికి ఏపీ తీరాన్ని సమీపించే అవకాశముంది. క్రమంగా బెంగాల్ వైపు కదులుతూ ఉత్తరాంధ్ర తీరంపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాగల 36 గంటల్లో ఇది క్రమంగా బలహీన పడుతుందన్నారు.