మొన్నటి వరకు అధికార పార్టీ నేతలపై దాడి చేసిన వైరస్.. ఇప్పుడు టీడీపీ నేతలను వెంటాడుతోంది. తాజాగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం కరోనా బారిన పడ్డారు. ఆయన తొలిసారి వైరస్ బారిన పడ్డారు.తనకు కరోనా సోకిన విషయాన్ని టీడీపీ అధినేత స్వయంగా ఉదయం ప్రకటించారు. చంద్రబాబుకు కరోనా సోకిందన్న వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన రేపింది.
అయితే తన ఆరోగ్య పరిస్థితిపైనా చంద్రబాబే స్వయంగా వివరణ ఇచ్చారు. తాజా టెస్టుల్లో తనకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందన్న చంద్రబాబు.. వ్యాధి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని తెలిపారు. ఇన్పెక్షన్ తర్వాత వైద్యుల సూచనల మేరకు ఇంట్లోనే (హోం) ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాని చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కాలంలో తనను కలిసి ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని, ఏ మాత్రం అనుమానం ఉన్నా ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.
మొదట మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మంత్రి కొడాలి నాని గతవారం కూడా ప్రభుత్వపరమైన కార్యక్రమాలతో బిజీగా గడిపారు. ఆయనకు స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్‌గా తేలడంతో.. డాక్టర్ల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. తనను ఇటీవల కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.
గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(Ambati rambabu)కు సైతం వైరస్ సోకింది. తనకు మూడో సారి పాజిటివ్ వచ్చిందని..జలుబు, ఒళ్లు నొప్పులు రావడంతో టెస్ట్‌లు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. తనను ఎవరూ కలవొద్దని అందరూ మాస్క్‌లు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అంబటి రాంబాబు.
భోగి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో జరిగిన వేడుకల్లో అంబటి రాంబాబు పాల్గొన్నారు. మాస్క్ ధరించకుండానే గిరిజన మహిళలతో కలిసి ఆయన సాంప్రదాయ నృత్యాలు వేశారు. ఈ కారణంగానే ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అంబటి రాంబాబు ఇప్పటికే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి..
కేవలం వీరే కాదు.. రాజకీయ నేతల సన్నిహితులు, రక్తసంబంధీకులు సైతం భారీగానే కరోనా బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Balineni srinivasa reddy)సతీమణి శచీదేవి(Sachi devi)కి కూడా కరోనా సోకింది. ఆమె ఇంట్లోనే ఐసోలేషన్(Isolation)లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (Ugra Narasimha Reddy)కరోనా బారినపడ్డారు. ఇలా రాజకీయ నేతలంతా వరుస కరోనా బారిన పడుతున్నారు.