Corona Effect On Tirumal: ఆంధ్రప్రదేశ్ పై కరోనా మళ్లీ విరుచుకుపడుతోంది. సుమారు రెండు నెలల తరువాత రోజు వారీ కేసుల సంఖ్య వేయి దాటుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా కఠినంగా నైట్ కర్ఫ్యూ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీతో నడపాలని.. వివాహాలు, పంక్షన్లపైనే ఆంక్షలు పెట్టింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంపైనా కరోనా ప్రభావం పడింది.
మళ్లీ తిరుమలలో కఠిన ఆంక్షలు విధిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. మళ్ళీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం దృష్ట్యా తిరుమలలో కోవిడ్ మార్గదర్శకాలు మరింత కఠినంగా అమలు చేయాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
జనవరి 13వ తేదీ వైకుంఠ ఏకాదశి,14వ తేదీ ద్వాదశి ద్వాదశి తో పాటు మిగిలిన 8 రోజులు భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జనసమూహం ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రతి భక్తుడు, ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. భక్తులకు ప్ర్త్తత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే తిరుమల వచ్చే వారు ఎవరైనా తప్పక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని.. లేదా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని స్పష్టం చేశారు.
ఇక వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి ఆలయంలో భక్తులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు. భక్తులు తోపులాటకు దిగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలని ఛైర్మన్ అధికారులను ఆదేశించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.