సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగులో మాట్లాడటం మంచి పరిణామం అని ప్రశంసించారు. సీఎం తెలుగులో మాట్లాడిన తర్వాత తాను మాట్లాడకపోతే బాగోదని సీజేఐ అన్నారు. తాను, ముఖ్యమంత్రి మాత్రమే తెలుగులో మాట్లాడటం ఓ ప్రాధాన్యంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ ఒకే వేదికపై కూర్చున్నారు. కోర్టు భవన నిర్మాణాలు పూర్తి కావడం చాలా సంతోషించదగ్గ విషయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో నిర్మించిన జీ+7 నూతన భవనాల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బార్ అసోసియేషన్ సభ్యులు జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, న్యాయవ్యవస్థకు చెందిన ప్రతి విషయంలో సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేశారు.