సమ్మెకు సమర శంఖం పూరించారు ఉద్యోగులు.. తమను తక్కువ అంచనా వేయొద్దంటూ విజయవాడ వేదికగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.. ఎవరూ ఊహించని రీతిలో.. ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు చేరుకున్నారు. ఇక బీఆర్టీఎస్ రోడ్డు అయితే ఇసుక వేసినా రాలనంతగా జనం గుమిగూడారు.. తమ ఉద్యమం ఇక్కడితో ముగియలేదని.. ఇదే ఆరంభం అంటున్నారు ఉద్యోగులు..
అడుగడుగునా ఆంక్షలు పెట్టారు.. ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. విజయవాడ వచ్చే రహదారులను అన్నంటినీ పోలీసులు నిర్భంధించారు. గల్లీకో చెక్ పోస్టు పెట్టి.. అందర్నీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రం నుంచి విజవాడలో నిఘా నేత్రం పెట్టారు.. ఉద్యోగులు భారీ సంఖ్యలో చేరుకుండా అన్ని ప్రయత్నాలు చేశారు.. కానీ వారి అంచనాలను ఉద్యోగులు తలకిందులు చేశారు.
ప్రభుత్వం ఢీ అంటే ఢీ అనడానికే ఉద్యోగులు సిద్ధమయ్యారు. అందుకోసం ఈ నెల జీతాలను వదులుకునేందుకు వెనుకడుగు వేయలేదు. ఇదే స్ఫూర్తితో.. తమ సత్తా చూపిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ రచ్చ పతాక స్థాయికి చేరుకుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ పిలుపు ఇచ్చిన ఉద్యమం ఇంత విజయవంతం కావడంతో ఉద్యోగ సంఘాల నేతలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.
నిన్న రాత్రి నుంచి విజయవాడలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఛలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో అసలు కార్యక్రమం సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు ఉండేవి. ముఖ్యంగా పోలీసులు ఎక్కడికక్కడ ఉద్యోగులను అడ్డుకున్నారు. అయినా ఉద్యమం నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. చెప్పినట్టే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బుధవారం సాయంత్రం నుంచే ఛలో విజయవాడకు వచ్చిన ఉద్యోగులను ఎక్కడిక్కకడే పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వందలాది మంది ఉద్యోగులు మెరుపులా బీఆర్టీఎస్ రోడ్ లోకి దూసుకుని వచ్చారు. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఎర్ర జెండాలు పట్టుకుని నినాదాలతో ఉద్యోగులు హోరెత్తించారు.