APSRTC Shcok: కొన్ని రోజుల కిందట తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తెలంగాణ ఆర్టీసీ ధరలు పెంచడం లేదు కాబట్టే.. మా బస్సుల్లోనే ఆంధ్రా ప్రజలు ప్రయాణం చేయండి అని ఆయన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ తరువాత కూడా ఏపీ అధికారుల తీరులో మార్పు రాలేదు. సంక్రాంతికి అందరికీ షాక్ ఇస్తూ చార్జీలను పెంచేశారు. దీంతో ఆ ట్వీట్ తో ఏపీ రేట్లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
సాధారణంగా చాలామంది పండక్కి సొంతూరు వెళ్లాలని భావిస్తారు. దీంతో మహానగరాలు బోసి పోతాయి. కర్ఫ్యూ వాతావరణ కనిపిస్తుంది. రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతాయి. ఇలాంటి సమయంలో ప్రైవేటు బస్సుల దోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ధర వేయి రూపాయలు ఉంటే.. దాన్ని ఐదు, ఆరు వేల రూపాయల వరకు అమ్ముతారు..
ప్రైవేటు దోపిడీ భరించలేక.. ట్రైన్ రిజర్వేషన్లు దొరకక పోవడంతో.. చాలామంది ఆర్టీసీ బస్సులపై ఆధారపడతారు... ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రైవేటు వాళ్లను అనుసరిస్తూ.. ఏపీలో టికెట్ల ధరను పెంచడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. అయితే ఇదే సమయంలో తెంగాణ ఆర్టిసి బస్సుల్లోనే ప్రయాణించి డబ్బుల ఆదా చేసుకోవాలని ఇటీవల ఎండీ సజ్జనార్ (sajjanar) ఓ ప్రకటన విడుదల చేయడం ఇప్పుడు హైలైట్ అవుతోంది.
సంక్రాంతి సందర్భంగా నడిపే స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను భారీగా పెంచుతున్నట్లు ఏపీఎస్ ఆర్టిసి (APSRTC) ప్రకటించింది. డీజిల్ రేటు 60 శాతం పెరగడం, ఒకవైపు బస్సు ఖాళీగా వెళుతుంది కనుక టికెట్ ఛార్జిలను 50% పెంచినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమల రావు (dwaraka tirumalarao) ప్రకటించారు. పరిస్థితులను అర్థం చేసుకుని మన ప్రాంతం వారు మన బస్సులను ఆదరిస్తారని ఆశిస్తున్నానంటూ ఏపీ ఆర్టీసి ఎండీ ఓ ప్రకటన విడుదల చేసారు.
సంక్రాంతి సెలవులకు అనుగుణంగా.. మొత్తం 11 రోజులపాటు ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు. అంటే శుక్రవారం జనవరి ఏడు నుంచి 18వ తేదీ వరకు 6970 అదనపు బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఇప్పటికే రెగ్యులర్ సర్వీసుల్లో 60%, స్పెషల్ బస్సుల్లో 50% ఇప్పటికే రిజర్వ్ అయ్యాయని ఏపిఎస్ ఆర్టిసి ఎండీ తెలిపారు.
తాజా రద్దీ.. గత అనుభవాలను లెక్క వేసుకొని.. సంక్రాంతి పండుగ ముందు నుంచే 4,145 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయని ఎండీ వివరించారు. కేవలం హైదరాబాద్‌కే 1,500 బస్ సర్వీసులను కేటాయించారు.