Sunday Shock: సాధారణంగా వేసవిలో చికెన్ రేట్లు తక్కవగా ఉండాలి.. కానీ రివర్స్ లో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎండాకాలం మొదలైనప్పటి నుంచీ క్రమంగా పెరుగుతూ వచ్చిన చికెన్ రేటు ఇప్పుడు.. ఆల్ టైం రికార్డు స్థాయికి చేరింది. సండే వచ్చింది.. చికెన్‌తో విందు ఆరగిద్దామని ఆలోచిస్తున్న జనానికి పెరిగిన చికెన్ ధరలు ఇప్పుడు షాకిస్తున్నాయి.
ఇక ఆన్లైన్లో అయితే ఇంకాస్త ఎక్కువగానే ఉంది. దేశీ చికెన్ కేజీ ధర మాత్రం 470 రూపాయలు పైనే ఉంది. ఇంతకుముందు కేజీ 150-200 వరకు పలికిన ధరలు ఉన్నట్లుండి పెరిగేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు వ్యాపారులు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండలు పెరిగి ఏప్రిల్ 1 నుంచి నెలాఖరు వరకు వడగాడ్పులు వీచాయి. గాలిలో తేమశాతం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో వాతావరణం వేడెక్కింది. ఇది కోళ్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపింది.
వేసవిలో 45 రోజులకు సగటున కోడి రెండు కిలోలు అవుతుంది. కానీ ఇప్పుడది కిలోన్నర కూడా రావడం లేదని, ఫారంలో ఉంచితే ఎండకు చనిపోతాయనే భయంతో వెంటనే అమ్మేస్తున్నారని తెలుస్తోంది. వర్షాలు లేక కూరగాయల దిగుబడులు తగ్గడం, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో వ్యాపారాలు జోరందుకోవడం కూడా చికెన్ ధరల పెరుగుదలకు కారణమైంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆదివారం 7లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సగటున 3-3.5 లక్షల కిలోల కోడిమాంసం అమ్మకాలు జరుగుతున్నాయని, అందు కు తగ్గట్టుగా ఫారాల్లో కోళ్లు లేవని విశాఖ బ్రాయిలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు థాట్రాజు అప్పారావు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు. ధరల పెరుగుదల దేశవ్యాప్తంగా ఉందని ఆయన తెలిపారు.
కాగా, ధరల పెరుగుదలకు కోళ్ల పరిశ్రమలో కంపెనీల గుత్తాధిపత్యమే కారణమని కొందరు రైతులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కోళ్ల పరిశ్రమలో 80 నుంచి 85 శాతం వాటా కంపెనీలదేనని, మిగిలిన 15-20 శాతమే రైతులు ఉన్నారని చెబుతున్నారు. దీనికితోడు చాలామంది రైతులు కోళ్లు పెంచి కంపెనీలకు అందిస్తున్నారు. అంటే పిల్ల, మేత, మందులు కంపెనీలు సరఫరా చేస్తుండగా... రైతులు కోళ్లు పెంచి తిరిగి అవే కంపెనీలకు అందజేస్తుంటారు.
ఆ రోజు రేటుపై నాలుగు నుంచి ఆరు రూపాయల వరకు కమీషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలో ధరల నిర్ణయంలో కంపెనీలదే కీలకపాత్ర కావడంతో మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా రేట్లు పెంచుతున్నారని కొందరు రైతులు చెబుతున్నారు. కంపెనీల మధ్య వ్యాపారపరంగా పోటీ ఉన్నా ధరల నిర్ణయంలో మాత్రమే దాదాపు ఒకేమాట మీద ఉంటారని, ప్రస్తుతం చికెన్ ధరల పెంపునకు కంపెనీలే కారణమని పౌల్ట్రీ రైతులు అంటున్నారు.
ప్రస్తుత సీజన్లో చికెన్‌కు డిమాండ్ బాగా పెరిగింది. పెళ్లిళ్లు, ఫెస్టివల్స్ ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ ఎక్కువైంది. పెరిగిన పెట్రోల్, డీజిల ధరలు కూడా చికెన్ ధరలు పెరిగేందుకు కారణాలుగా చెబుతున్నారు. వీటితోపాటు కోళ్ళ దాణా ఖర్చులు పెరగడం, ఎండల ప్రభావంతో చాలా కోళ్లు చనిపోతుండటంతో ఉత్పత్తి తగ్గింది.