P. Anand Mohan, Visakhapatnam, News18. Journey To Lambasingi: ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది.. మేఘాలను పట్టుకోవచ్చు అనే ఫీలింగ్ కలిగే ప్రంతం అది.. ఆ హిల్స్ పై నిలబడితే మేఘాల్లో తేలిపోయే ఫీలింగ్ కలుగుతుంది. కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే సీనరలు మన కళ్లముందే ఆవిష్కరించే ప్రాంతం అది.. అందుకే ఇప్పుడు అందరి చూపు ఈ సరికొత్త పర్యాటక ప్రాంతంపై పడింది. అదే లంబసింగి.. అందే లంబసింగి మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఇంకా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
సాధారణంగా పౌరాణిక సినిమాల్లో నారదుల వారు తంబుర మీటుతూ.. మేఘాల్లోంచి అలా వెళ్లిపోతుంటే.. పాల కడలిలో శేషతల్పంపై విష్ణుమూర్తి పవళిస్తుంటే.. భలే అనిపించేది. అయితే అదంతా సినిమా డైరక్టర్లు.. కెమెరా ట్రిక్ అని తెలిసిందే.. కానీ అలాంటి మేఘాలు.. అది కూడా ధవళ వర్ణం మేఘాలు ముద్దాడుతుంటే.. నింగి తలుపులు తెరుచుకుంటూ సూరీడు చొరబడుతుంటే.. చెప్తుంటేనే మేఘాలలో తేలిపోయే ఫీలింగ్ కలుగుతోందా.. మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి ప్రత్యక్షంగా అక్కడ వాలిపోండి.
ఏటా డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ ప్రాంతం ‘ఆంధ్రా కశ్మీర్’గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఏడాది కూడా అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఇక్కడి గ్రామాల్లో మంచు దుప్పట్లు మరింతగా పరచుకున్నాయి. గత కొద్ది రోజులుగా చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. అక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తూ.. పర్యాటకులు పరవశించిపోతున్నారు.
పచ్చని కొండలన్నీ బంగారం తాపడం చేసినట్టు మెరిసిపోతుంటే.. ఏ తనువు మాత్రం మురిసిపోదు? అలాంటి అనుభవాలకు కొడైకెనాలో.. కులుమనాలో వెళ్లిపోనక్కర లేదు. విశాఖ జిల్లా వస్తే సరిపోతుంది. పాల సంద్రం లాంటి పొగమంచు అందాలు వీక్షించేందుకు లక్షలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. నుంచి వంద కిలో మీటర్ల దూరం లో ఉంది.
లంబసింగి అన్నది ఒక్కటే కాదు.. విశాఖపట్నంలో పర్యటన మొదలైతే.. రెండు మూడు రోజుల పాటు క్షణం కూడా వేస్ట్ చేయకుండా తిరిగినా.. ఆ చుట్టు పక్కల అందాలూ చూడడానికి మూడు రోజులు కూడా సరిపోవేమో.. అటు వైపు అరుకు.. బుర్రా కేవ్స్.. ఇటువైపు ఇటీవలే వెలుగులోకి వచ్చిన వనజంగి కొండలు.. వీటికి తోడు కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలు.. ఇలా ఎన్నో మనసుకు హాయి గొలుపుతూనే ఉంటాయి.
అక్కడికి వెళ్లే ప్రతి ప్రదేశం ఒక అందామైన రూపం సంతరించుకుంటూ ఉంటాయి.. విశాఖ సిట నుంచి ఒక 30 కిలోమీటర్లు దాటి ముందుకు వస్తే... అరుకు వెళ్లే వరకు ప్రతి ఏజెన్సీ గ్రామంలో ఒక అందమైన ప్రకృతి సోయగంగానే కనిపిస్తాయి.. అయితే ఈ ఏజెన్సీ పర్యటకు ఇదే సరైన సమయం అంటున్నారు ప్రకృతి ప్రేమికులు.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే వెళ్తేనే ఈ టూరులో అసలు మజా ఉంటుంది అంటున్నారు.. అందుకే కార్తీక మాసం ముగిసిన తరువాత కూడా ఇంత రద్దీగా ఉంటోంది లంబసింగి.
తాజాగా అక్కడి రద్దీకి తగ్గట్టు టూరిజం శాఖ ఫోకస్ చేసింది. లంబసింగి అందాలను తెల్లవారుజామునే వీక్షించేందుకు ఏపీ టూరిజంశాఖ ప్రత్యేకప్యాకేజీ ప్రకటించింది. విశాఖ హరిత హోటల్ నుంచి రోజూ మధ్యాహ్నం 1.30గంటలకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. లంబసింగిలోనే పర్యాటకులు బసచేసి పాడేరు ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించొచ్చని టూరిజం మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. అక్కడ భోజనాలు చేసిన తర్వాత బయలుదేరి నర్సీపట్నం మీదుగా లంబసింగి చేరుకుని ఇక్కడ రాత్రి బస చేస్తారు. ఇక్కడి అందాలను వేకువజామున వీక్షించిన తర్వాత అల్పాహారం ముగించి జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాలకు బయలుదేరుతారు.
అక్కడ నుంచి పాడేరు మోదకొండమ్మ ఆలయం, హుకుంపేట మండలంలోని మత్స్యగుండం పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. అక్కడ నుంచి పాడేరు మీదుగా తిరుగు పయనమవుతారు. పర్యాటకులు బయలుదేరిన దగ్గర నుంచి లంబసింగిలో బస, రెండు రోజుల భోజనం, అల్పాహారం, బస్సు చార్జీతో కలిపి పెద్దలకు 1970, పిల్లలకు 1650లు టికెట్ ధరగా నిర్ణయించారు.
లంబసింగి చుట్టూ ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే? వావ్.. బొర్రా కేవ్స్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్రా ఊటి అరకులో.. బొర్రా కేవ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. బొర్రా గుహలకు పర్యాటకులు ప్రస్తుతం భారీగా పోటెత్తుతున్నారు. ప్రస్తుతం పిక్నిక్ సీజన్ కావడంతో మన్యంలోఅందాలు తిలకించేందుకు భారీగా తరలివస్తున్నారు. వలిసెపూల తోటలు పర్యాటకులను ఆహ్వానం పలుకుతున్నాయి. అరకు–డుంబ్రిగుడ, అనంతగిరి విశాఖ ప్రధాన రహదారి ఆనుకుని వలిసెపూల మధ్య సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడిచేస్తున్నారు.
సీతమ్మ పర్వతం.. అద్భుతం హుకుంపేట : మన్యంలో అతిపెద్ద కొండ సీతమ్మ పర్వతాన్ని (జెండాకొండా) సబ్ కలెక్టర్ వి.అభిõÙక్ సందర్శించారు. శనివారం వేకువ జామునే పాడేరు నుంచి తీగలవలస పంచాయతీ ఓలుబెడ్డా గ్రామానికి చేరుకుని అక్కడనుంచి గిరిజనులతో కలిసి వేకువ జామునే సుమారు నాలుగు కిలోమీటర్లు మేర కాలినడకన ప్రయాణించారు. కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కొండపైకి చేరుకుని మంచు అందాలను ఆస్వాదించారు. కొండాలో ఉన్న చరిత్ర కలిగిన తేనేపట్టు గుహలు, దింసారాళ్లు, తిరిగలి రాళ్లు, బ్రిటిషు వాళ్లు నిర్మించిన జెండా కోటను చూసి ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో జెండాకొండ పర్యాటక కేంద్రంగా భాసిల్లడం ఖాయమన్నారు.
మంచుకురిసే వేళలో.. పాడేరు : పొగమంచుతో పాటు మేఘాల కొండగా విశ్వవ్యాప్తి పొందిన వంజంగి హిల్స్‌కు కూడా వేకువజామునే పర్యాటకులు పోటెత్తు తున్నారు. వీకెండ్ డేస్‌లో అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులంతా వంజంగి హిల్స్‌కు చేరుకుని ఇక్కడ ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. దీంతో పర్యాటకుల రద్దీతో వంజంగి హిల్స్‌లోని అన్ని ప్రాంతాలు సందడిగా మారాయి.