పి.ఆనంద్ మోహన్, విశాఖపట్నం, న్యూస్ 18,
Visakhapatnam to Araku valley Train Journey: అంధ్రా అందాల ఊటీ అరకు (Andhra Ooty Araku) పచ్చటి ప్రకృతి, అందమైన జలపాతాలు.. సహజ సిద్దమైన సౌందర్యానికి నిలువుటద్దం గా నిలిచే ఈ హిల్ స్టేషన్.. ఒకటేంటి ఇంకా ఎన్నె ఎన్నెన్నో అద్భుతాలు మనసుకు కనువింద చేస్తాయి. అడుగడునా కట్టి పడేస్తుంటాయి. విశాఖ ఏజెన్సీలో అద్భుతమైన పర్యాటక ప్రదేశం ఇది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రదేశాల్లో (Best tourist Places) ఇదే అత్యుత్తమమైనది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక్కడకు జీవితంలో ఒకసారి అయినా రావాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుంటారు అనడం అతిశయోక్తి కాదు. చుత్తూ ఎత్తైన కొండలు, పచ్చని పరిసరాలు, ముచ్చటగొలిపే వాతావరణం, గలగలా పారే జలపాతాలు ఇవన్నీ కలస్తే అందమైన అరకు అవుతుంది. అందుకే ఏపీ టూరిజం వారి డెస్టిటేషన్ పాయింట్స్ లో అతి ముఖ్యమైన స్పాట్ గా అరకు ఉంది. ఇప్పటికే అరకు వెళ్ళేందుకు విశాఖ నుంచి బస్సు, రైలు మార్గాలు ఉన్నాయి. రైళ్ళలో అరకు వెళ్ళేవారికి ఇపుడు అద్భుతమైన అనుభూతులను జత చేసింది రైల్వే శాఖ.
అరకు వెళ్లిన తరువాత అందాలను చూడడం కాదు.. వైజాగ్ తో మొదలైన జర్నీ నుంచి అద్బుత కావ్యంలా అనిపించే సోయగాలను చూసేందుకు.. విస్టోడోమ్ కోచ్ లను ఏర్పాటు చేసింది. వీటి కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూంటే ఎట్టకేలకు మూడు విస్టోడోమ్ కోచ్ లు విశాఖ చేరుకున్నాయని.. ఈ విస్టోడోమ్ కోచ్ లను అరకు వెళ్లే రైళ్ళకు జత చేశారు. దీంతో ఈ కోచ్ లలో అద్దాల ద్వారా అటూ ఇటూ ఉన్న అరకు అందాలను రైలులో ప్రయాణిస్తూ కూడా హాయిగా ఆస్వాదించే వీలుంటుంది. ఇప్పటికే అరకు టూరిజానికి ఆదరణ ఎక్కువగా ఉంది. విస్టోడోమ్ కోచ్ లు కనుక వస్తే టూరిస్టుల తాకిడి ఇక రెట్టింపు అవుతుందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది.
ప్రకృతి సౌందర్యానికి నెలవైనదిగా అరుకు లోయను ప్రకృతి ప్రేమికులు అభివర్ణిస్తుంటారు. ఇక్కడి అందాల గురించి చెప్పాలన్నా అక్షరం పులకిస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్న గిరుల సోయగాలు, చినుకు తడికి మెరిసిపోయే పచ్చదనం, ఈ అందాలకు తోడు గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబించే పోడు వ్యవసాయ పద్ధతులు.. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు మనసుకు హత్తుకుంటాయి. అందుకే మరపురాని అనుభూతులను పంచే పర్యాటక స్వర్గధామం అరకులోయ అంటారు.
పేరు ఆంధ్రా ఊటీ అంటారు కానీ.. అంతకుమించిన పర్యాటక ప్రదేశాలు ఇక్కడ కొకొల్లలు అని చెప్పాలి. బొర్ర కేవ్స్ నుంచి బృందావనం పార్కు.. కాఫీ తోటల నుంచి ఆదివాసి మ్యూజియం వరకూ ఎన్నో వింతలు.. విశేషాలు. అందుకే దేశవిదేశీ పర్యాటకులు ఇక్కడకు భారీగా వస్తుంటారు. హాలిడేస్‌లో సేదతీరుతుంటారు. ముఖ్యంగా కార్తీక మాసం.. అంటే వింటర్ లో ఇది ఒక ప్రత్యేకమైన పికినిక్ స్పాట్ గా ముద్ర వేసుకుంది.
మార్గమధ్యలో ఎన్నో మధురానుభూతులను అనుభవాన్ని పంచుతూ సాగుతోంది ఈ ప్యాసింజర్. ఎత్తయిన కొండలు ఆ కొండలపై నుంచి జాలువారే జలపాతాలు.. లోయలు.. కొండ గుహలోంచి సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను మధురానుభూతిని పంచుతుంది. అందుకే ఈ రైల్ అంటే అంత క్రేజ్. లగ్జరీ కార్లున్నా, ఏసీ వాహనాలు ఉన్నా రైలు ప్రయాణం చేయడానికే పర్యాటకులు అమితాసక్తి చూపుతుంటారు.
అయితే అద్దాలబోగి లేకుండా ప్రయాణం సాగితే సమ్ థింగ్ ఇంపార్టెంట్ మిస్ అయినట్టే. కరోనా కష్టాలు… సాంకేతిక సమస్యలతో కొంతకాలంగా అరకు టూరిస్టులకు మధురానుభూతులు దూరమయ్యాయి. దీంతో పర్యాటకులు నిరుత్సాహానికి గురౌతున్నారు. మళ్ళీ తాజాగా ఒకటి కాదు.. ఏకంగా మరో రెండు అద్దాల భోగిలు రెడీ చేశారు. కిరండోల్ పాసింజర్ కు అనుసంధానించి ట్రైల్ రన్ పూర్తిచేశారు.
గతంతో పోలిస్తే ఈ విస్టాడోమ్ కోచ్‌లకు అత్యాధునిక హంగులను అద్దారు. ఆకట్టుకునే ఎర్రటి రంగుతో కుర్చీలు, ఫలహారాలు తినేలా సీట్ల ముందు ఏర్పాట్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్లున్నాయి. భోగి సీలింగ్ కు అద్దాలను అమర్చారు. రైలు ప్రయాణం లో ఎండ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా సీలింగ్ డోర్లు మూసుకునేలా ఏర్పాటు చేశారు. సేఫ్టీలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాలను అమర్చారు. ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీ వాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన విశాఖపట్నం.. భవిష్యత్తు రాజధాని కూడా.. ఈ అందాల నగరం సందర్శనకు వచ్చే టూరిస్టులెవరైనా అరకులోయను సందర్శించకుండా వెళ్లరు. నగర పర్యటన ముగించుకున్న తరువాత హిల్ స్టేషన్ కు పయనమయ్యేందుకు అధికశాతం టూరిస్టులు ఆసక్తి చూపుతారు. విశాఖపట్నం నగరానికి 114 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అరకులోయ హిల్ స్టేషన్ ఉంటుంది. పర్వత శ్రేణుల నడుమ ఒదిగి ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి రమణీయతకు ఆలవాలం. అరకులోయ కేవలం పర్యాటక కేంద్రంగానే కాదు.. లొకేషన్ల పరంగా సినిమా షూటింగ్ లకు కూడా గమ్యస్థానంగా నిలుస్తుంది.