కన్న తల్లిదండ్రులే మూఢనమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో కూతుళ్లిద్దరినీ దారుణంగా హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశమయింది. తండ్రి పురుషోత్తం నాయుడు, తల్లి పద్మజతోపాటు పాటు కూతుళ్లిద్దరు కూడా ఉన్నత విద్యావంతులే అయినా ఇలాంటి దారుణానికి పాల్పడటం అందరినీ విశ్మయానికి గురిచేస్తోంది. పైగా ఒక రోజు ఆగండి నా కూతుళ్లిద్దరూ బతికి వస్తారని తల్లి పద్మజ చెబుతుండటాన్ని చూస్తే ఎంతలా మూఢనమ్మకాల ప్రభావానికి లోనయిందో తెలియజేస్తోంది.
అచ్చం ఇలాగే రెండేళ్ల క్రిందట ఢిల్లీలోనూ జరిగింది. 2018లో ఢిల్లీలోని బురారీలో (Burari Horror) ఓ కుటుంబంలోని మొత్తం 11 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబంలోని పది మందిని ఇంట్లో దూలానికి ఉరి వేసి, ఆ తర్వాత 77ఏళ్ల నారాయణ్ దేవీ ఓ గదిలో విషం తీసుకుని మరణించింది. మళ్లీ బతుకుతామని నమ్మే వీరంతా ఈ దారుణానికి పాల్పడ్డారని విచారణలో తేలింది.
కలకత్తాలోనూ మూఢనమ్మకాలతో ఓ కుటుంబం ఆగమయిపోయింది. 2015లో జూన్ నెలలో కలకత్తాలోని రాబిన్సన్ వీధిలో (Kolkata's Horror House) పార్థో డే అనే వ్యక్తి తండ్రి మృతదేహాన్ని అందజేయడానికి పోలీసులు వెళ్లారు. ఆ ఇంట్లో పోలీసులకు అతడి సోదరి, ఓ శునకం అస్తిపంజరాలు పోలీసులకు కనిపించాయి. చనిపోయిన తల్లి తిరిగి లేస్తుందన్న నమ్మకంతో కొన్ని నెలలుగా ఉపవాసం ఉండి ఆరు నెలల క్రితం ఆమె చనిపోయింది. శునకం కూడా మరణించింది. అయినా వాటితోనే అతడు సహజీవనం చేశాడు.
పౌర్ణమిరోజు ఓ బాలికను బలి ఇస్తే మంచి జరుగుతుందని 2018వ సంవత్సరం జనవరి 31న హైదరాబాద్ లో ఓ నెలలు నిండని బాలికను క్షుద్రపూజలు చేసి చంపేశారు. హైదరాబాద్ లోని కేరుకొండ రాజశేఖర్, తన భార్య శ్రీలతతో కలిసి ఓ తాంత్రికుడు చెప్పింది నమ్మి, ఫుట్ పాత్ పై తల్లి ఒడిలో నిద్రపోతున్న బాలికను అపహరించి ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో గతేడాది నవంబర్ నెలలో సరిగ్గా దీపావళి పండుగ రోజున ఓ యువకుడు పక్కింట్లో ఉన్న ఏడేళ్ల బాలికను అపహరించి ఉరేసి చంపాడు. ఆ తర్వాత ఆమె కాలేయం, ఇతర శరీరభాగాలను కోసి తన బంధువులకు ఇచ్చి కూర వండుకుని తినమని చెప్పాడు. అలా చేస్తే పిల్లలు పుడతారని తాంత్రికులు చెప్పింది నమ్మి ఆ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. తన బంధువులు పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్నారని ఆ యువకుడు ఓ ప్రాణం తీశాడు.