PRC Fight: ఆంధ్రప్రదేశ్ లో సమ్మె సైరన్ మోగనుంది.. ఇవాళే రాష్ట్ర సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగ సంఘాలు నోటీసులు ఇవ్వనున్నాయా.. అవుననే అంటోంది ఏపీ ఎన్జీవో సంఘం.. తాజా చర్చల ప్రకారం మరోసారి ఉద్యోగులతో ఇవాళ చర్చించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే ఇతర సంఘాలు తమతో కలిసి వచ్చినా.. రాకపోయినా.. తాము మాత్రం సమ్మె నోటీసు ఇచ్చే తీరుతామన్నారు ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.
ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని ఇప్పికే అన్ని సంఘాలు నిర్ణయించాయి. అన్ని సంఘాల ప్రతినిధులు ఇవాళ 11 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం అవుతాయి. ఈ సమావేశం సమ్మెకు ఎప్పటి నుంచి వెళ్లాలి.. ఏఏ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలు అన్నదానిపై విధివిధానాలు ప్రకటించనున్నాయి.
అందరం కలిసి పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఉద్యోగ సంఘాలు నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇక తమ ఆఖరి అస్త్రం సమ్మె నోటీసులు ఇవ్వడమే అని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. అయితే సమ్మెకు 15 రోజుల ముందు సమ్మె నోటీసులు ఇవ్వాలి కాబట్టి.. ఫిబ్రవరి పదవ తేదీ తరువాత సమ్మెకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ లోపు ప్రభుత్వం వెనక్కు తగ్గితే పరవలేదు. లేదంటే సమ్మె తప్ప వేరే మార్గం లేదంటున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ సమయం లోపే సీఎస్ కు సమ్మె నోటీసులు ఇవ్వాలని ఏపీ JAC చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడించారు.
అన్నీ అసోసియేషన్లు పీఆర్సీ సాధనకోసం కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు చెప్పారు బండి శ్రీనివాసరావు. ఒకే వేదిక మీద నుంచి పీఆర్సీ సాధన కోసం సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. కార్యాచరణ ఎలా ఉండాలో ఇవాళ ఉదయం 11 గంటలకు మా చర్చల్లో నిర్ణయానికి వస్తామని అన్నారు. నాలుగు జేఏసీల అంగీకారం కోసం సీఎస్‌కు సమ్మె నోటీస్ ఇచ్చే విషయాన్ని ఇవాళ్టికి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.
రెండు రోజుల నుంచి అంతర్గతంగా అన్నీ సంఘాల ఐక్యత కోసం ప్రయత్నాలు చేశామని, ఉద్యోగులకు 11వ PRC నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి ఒకే వేదిక మీదకు వచ్చి డిమాండ్లు నెరవేర్చుకోవాలని నిర్ణయించినట్లు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు స్పష్టం చేశారు.
అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ జరిగే భేటీ తరువాత నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఉమ్మడి పోరాటంతో మెరుగైన పీఆర్సీ సాధించుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సమ్మెకు వెళ్లడమే సరైనది మెజార్టీ సభ్యుల డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సైతం అతే డిమాండ్ వినిపిస్తున్నారని ఉద్యోగ సంఘం నేతలు చెబుతున్నారు.
పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులు నిత్యం నిరసనలు తెలియచేస్తున్నారు. నిన్న లంచ్ బ్రేక్ టైమ్‌లో ధర్నా చేపట్టారు. మూడవ బ్లాక్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెక్రటేరియట్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుని.. తమకు న్యాయమైన హెచ్ఆర్ఏ, సీసీఏలతో కూడిన జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఆందోళనలు విరమించబోమంటున్నారు.
ఏపీలో పీఆర్సీ పంచాయితీ హైకోర్టుకు చేరింది. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ హైకోర్టులో పిటిషన్ వేసింది. విభజన చట్ట ప్రకారం ఎలాంటి సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించకూడదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పీఆర్సీ జీవోల్ని రద్దు చేయాలంటూ పిటిషన్లో కోరింది. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఏపీలో ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగానే.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది. ఇక- కొత్త జీతాలు వద్దు.. పాతవే కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.