YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. గౌరవ అధ్యక్ష పదవికి.. వైఎస్ విజయమ్మ రాజీనామా ప్రకటించారు. అదికూడా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్లీనరీ వేదికగానే.. అందులోనూ దివంగత్ వైఎస్ఆర్ జయంతి రోజే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
చాలా రోజుల తరువాత జగన్ తో కలిసి కనిపించిన విజయమ్మ సంచలన నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్సీపీ నుంచి తాను తప్పుకుంటున్నానని.. పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇటీవల జరిగిన పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. తన అన్నకు ఎలాంటి కష్టం, ఇబ్బంది కలగకూడదనే షర్మిల తెలంగాణ కోడలిగా అక్కడ పార్టీ పెట్టుకున్నారన్నారు విజయమ్మ.
ఏపీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం సీఎం జగన్కు కచ్చితంగా స్టాండ్ ఉంటుందని.. వైఎస్ఆర్ ఆశయాలు పునికిపుచ్చుకున్న వారు జగన్, షర్మిల అన్నారు. తాను రాయని, చేయని సంతకంతో రాజీనామా లేఖ విడుదల చేశారని.. ఇవి జుగుప్సకర రాతలు అన్నారు. ఆ లేఖ చూసినప్పుడు చాలా బాధ వేసిందని.. తాను రాయని, తాను చేయని సంతకం ఉన్న లేఖను ఎలా రిలీజ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు.
ప్రస్తుతం మరో ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. గతంలోనూ ఆమె రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని.. కానీ ప్లీనరీ వరకు ఆగాలని జగనే స్వయంగా కోరారు అంటూ సమాచారం.. ప్లీనరి వేదికగా ఎందుకు రాజీనామా చేస్తున్నానని క్లారిటీ చెప్పి ఆ నిర్ణయం తీసుకుంటే పరవాలేదని.. లేదంటే ఆమె రాజీనామాకు తనతో విబేధాలే కారణమని ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని జగన్ కోరినట్టు తెలుస్తోంది.
మరోవైపు వైసీపీ అధినేత జగన్ సైతం.. అమ్మ రాజీనామా చేయడమే పార్టీకి మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. విజయమ్మ తనతోను అటు తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలతోనే ఉంటే.. అది కూడా విపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టు అవుతుందని జగన్ అభిప్రాయపడినట్టు సమాచారం. మరోవైపు విజయమ్మ సైతం ఎక్కువగా సర్మిల వెంటే ఉండాలి అనుకోవడం కూడా మరో కారణం అంటున్నారు.