ఆయన టూరుతో ప్రభుత్వానికి.. రాజకీయాలకు ఎలాంటి సబంధం లేదు. కేవలం వ్యాపార వేత్తగా.. అంటే అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న గల్లా జయదేవ్ తాజాగా మరో సదస్సులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పాల్గొన్నారు.
అంతేకాదు ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరుతో సీఎన్‌బీసీ టీవీ18 నిర్వహించిన ఓ చర్చా వేదికలో తెలంగాణ మంత్రి కేటీఆర్ సహా తెలుగు నేలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త శోభనా కామినేని, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సంజీవ్ బజాజ్, ఆశిష్ షాలతో కలిసి టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు.
గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ కాక ముందు నుంచే పారిశ్రామికవేత్తగా కొనసాగుతున్నారు. గల్లా కుటుంబం ఆధ్వర్యంలోనే అమర్‌రాజ బ్యాటరీస్ సంస్థ నడుస్తోంది. ఈ కంపెనీ యజమాని హోదాలోనే ఆయన దావోస్ సదస్సుకు హాజరయ్యారు. ఎనర్జీ రంగానికి చెందిన పలు పరిశ్రమల ప్రతినిధి బృందాలతో భేటీ కోసమే తాను ఈ సదస్సుకు హాజరయ్యానని గల్లా జయదేవ్ వెల్లడించారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. తన కంపెనీకి ఇబ్బందులు గురి చేస్తోందని.. కోర్టు ద్వారా అనుమతులు తెచ్చుకున్నా.. ఎదో రకంగా ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ఆయన పక్క రాష్ట్రాల్లో తమ కంపెనీ విస్తరించే ప్రయత్నం చేస్తున్నారు.. సొంత రాష్ట్రంలోనే వ్యాపార వేత్తలనే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. ఇక ఇతర పెట్టుబడి దారులను ఎలా ఆహ్వానిస్తుందని ప్రశ్నిస్తున్నారు.